‘300 మ్యాచ్‌లు ఆడాను.. నేను పిచ్చోడినా’

11 Jul, 2018 17:06 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మైదానంలో ఎంతో కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుంటారు. అందుచేత ధోనిని  అందరూ మిస్టర్‌ కూల్‌ అని పిలుస్తుంటారు. వికెట్ల ముందు బ్యాట్‌కు పని చెప్పి.. వికెట్ల వెనుక ఉండి జట్టును ముందుకు నడపటంలో తనవంతు కృషి చేస్తుంటారు. బౌలర్లకు తగిన సూచనలు ఇచ్చి, ఫిల్డింగ్‌ సెట్‌ చేస్తూ మైదానంలో చాలా కూల్‌గా ఉంటారు. ఈ మిస్టర్‌ కూల్‌ ఓ సారి చైనామన్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై ఫైర్‌ అయ్యారు. ఈ సంఘటన భారత్‌-శ్రీలంకల మధ్య గత సంవత్సరం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

ఇటీవల భారత్‌ ఆటగాళ్లు కుల్దీప్‌ యాదవ్‌, చాహాల్‌ ఓ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ధోనితో ఉన్న అనుభవాల్ని పంచుకున్నారు. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో తగిన సూచనలు ఇస్తారని ధోనిని కొనియాడారు. ఈ  సందర్భంగా కుల్దీప్‌ ధోని తనపై కోపం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.‘గత సంవత్సరం ఇండోర్‌లో భారత్‌- శ్రీలంకల మధ్య రెండో టీ-20 మ్యాచ్‌ జరుగుతుంది. ఈ టీ20లో మొదట ఇండియా బ్యాటింగ్‌ చేసింది. 261 పరుగుల లక్ష్యఛేదనతో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. అంతేకాక చాలా ఈజీగా లంక ఆటగాళ్లు స్కోర్‌ బోర్డును పరిగెత్తిస్తున్నారు. ఈ తరుణంలో బంతి నా(కుల్దీప్‌) చేతికి ఇచ్చారు. 

ఓ వైపు ఆటగాళ్లు దాటిగా ఆడుతున్నారు. నా బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్‌ సులువుగా బౌండరీలు కొడుతున్నారు. ఆ సమయంలో ధోని భాయ్‌ నా దగ్గరకు వచ్చి.. బంతిని బ్యాట్స్‌మెన్‌కు దూరంగా వేయాలని, అంతేకాక ఫీల్డింగ్‌ మార్చుకోమని సూచించారు. నేను అప్పుడు ఏం ఫర్వాలేదు ధోని భాయ్‌ అన్నాను. అంతే ఒక్కసారిగా కోపంతో ధోని.. 300 మ్యాచ్‌లు ఆడాను. నేను ఏమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నాన్నా అని ఆవేశానికి గురయ్యారు. అనంతరం ధోని చెప్పినట్లు బౌలింగ్‌ చేసి వికెట్‌ సాధించాను. అప్పుడు ధోని భాయ్‌ నా దగ్గరకు వచ్చి నేను మొదట నుంచి చెప్పింది ఇదే కదా అన్నాడని’ యాదవ్‌ ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. 

ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌యాదవ్‌ నాలుగు ఓవర్లు వేసి.. 52 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు సాధించారు. చాహాల్‌ కూడా నాలుగు వికెట్లు తీశారు. అంతేకాక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా అద్బుతంగా బ్యాటింగ్‌ చేశారు. కేవలం 35 బంతుల్లో రోహిత్‌ శర్మ ఫాస్టెస్‌ సెంచరీ నమోదు చేశారు. ఈ టీ20లో ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంక ఈ మ్యాచ్‌లో 172 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.


 

>
మరిన్ని వార్తలు