కోహ్లి స్వేచ్ఛనిస్తాడు.. ధోని సలహాలిస్తాడు

16 May, 2019 20:10 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిపై సహచర ఆటగాడు కుల్దీప్‌ యాదవ్‌ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. కోహ్లి, ధోనిల కెప్టెన్సీ శైలీ వేరువేరుగా ఉంటుందని పేర్కొన్నాడు. తన ఎదుగదలకు కోహ్లి అందించిన సహకారం మరువలేనదని అన్నాడు. ‘కోహ్లి నాకు దూకుడుగా బౌలింగ్‌ చేసేందుకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ పరిస్థితులను గమనిస్తూ బౌలింగ్‌ చేయమని మాత్రమే చెప్తాడు. మనల్ని నమ్మే సారథి ఉంటే మనం కచ్చితంగా విజయవంతం అవుతాం. అయితే ధోని కూడా స్వేచ్చనిస్తాడు. కానీ.. బౌలర్ లయ తప్పుతుంటే మాత్రం.. చిన్నపాటి సూచనలతో మొదలెట్టి.. అవసరమైన సలహాలు ఇస్తాడు. అంతేగానీ.. బౌలర్‌‌ నుంచి సామర్థ్యానికి మించిన ప్రదర్శనని రాబట్టుకోవాలని ఆరాటపడడు’అని కుల్దీప్‌ వివరించాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున తొమ్మిది మ్యాచులు ఆడిన కుల్దీప్ కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. దీని కారణంగా మిగితా మ్యాచ్‌లకు అతన్ని జట్టులోకి తీసుకోలేదు. ఇది తనకు ఎంతో బాధకలిగించదని.. కానీ ప్రపంచకప్, ఐపీఎల్ రెండు వేరు వేరని కుల్దీప్ తెలిపాడు. ‘ ఐపీఎల్.. ప్రపంచకప్‌కి ఎంతో తేడా ఉంది. అక్కడ ఐపీఎల్‌లో రాణించిన ఆటగాళ్లు ఉంటారు. కానీ అక్కడ అందరు దేశం కోసం ఆడుతారు. ఐపీఎల్‌లో నా ప్రదర్శన ప్రపంచకప్‌పై ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు. ఐపీఎల్‌లో విఫలమైన అనంతరం ధోని, రోహిత్‌లు నాతో మాట్లాడారు. నాలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు’ అని కుల్దీప్ వివరించాడు.

మరిన్ని వార్తలు