సంగక్కర అజేయ సెంచరీ

9 Aug, 2014 01:51 IST|Sakshi
సంగక్కర అజేయ సెంచరీ

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 252/2
పాక్‌తో తొలి టెస్టు

 
 గాలే: సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. తన చివరి 11 ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న ఈ 36 ఏళ్ల బ్యాట్స్‌మన్ తాజాగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులోనూ అజేయ శతకం (218 బంతుల్లో 102 బ్యాటింగ్; 13 ఫోర్లు)తో తన సత్తాను చాటుకున్నాడు.

ఇది అతడి కెరీర్‌లో 37వ శతకం కాగా పాక్‌పై 10వది. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్ (51), కలిస్ (45), పాంటింగ్ (41) మాత్రమే సంగకు ముందు ఉన్నారు. మరోవైపు ఈ సిరీస్‌తో టెస్టు కెరీర్‌కు ముగింపు పలుకనున్న మహేల జయవర్ధనే (109 బంతుల్లో 55 బ్యాటింగ్; 6 ఫోర్లు) చక్కటి అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఆటతీరుతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు లంక 80 ఓవర్లలో రెండు వికెట్లకు 252 పరుగులు చేసింది.
 
ఇంకా 199 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. ఆటకు మరో పది ఓవర్లు మిగిలి ఉండగా భారీ వర్షం కురవడంతో మ్యాచ్ సాధ్యం కాలేదు. ఓపెనర్ సిల్వా (140 బంతుల్లో 64; 11 ఫోర్లు) రాణించాడు. అంతకుముందు 99/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టును కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలమయ్యారు. జయవర్ధనే బ్యాటింగ్‌కు దిగిన సమయంలో పాఠశాల విద్యార్థులచే గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంపైర్ ఎల్బీ నిర్ణయాన్ని సవాల్ చేసిన మహేల లాభపడ్డాడు. మూడో వికెట్‌కు వీరిప్పటికే 108 పరుగులు జోడించారు.

మరిన్ని వార్తలు