బై.. బై... సంగ

24 Aug, 2015 23:58 IST|Sakshi
బై.. బై... సంగ

శ్రీలంక దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు
కొలంబో:
పదిహేనేళ్లుగా శ్రీలంక క్రికెట్‌కు అతడు వెన్నెముక.. జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో అతడి పాత్ర మరువలేనిది.. ఇన్నాళ్లుగా తన అసమాన ఆటతీరుతో జట్టును సమున్నతంగా నిలిపి అభిమానులను ఉర్రూతలూగించిన కుమార సంగక్కర.. తన కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్టు తన చివరిదని ఇంతకుముందే ప్రకటించిన ఈ సీనియర్ బ్యాట్స్‌మన్ సోమవారం మ్యాచ్ ముగిసిన అనంతరం ఘనమైన వీడ్కోలు తీసుకున్నాడు. ఇంతకాలం వెన్నంటి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులతో పాటు కోచ్‌లు, ఆటగాళ్లు, బోర్డు, ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చివరిసారిగా ప్రసంగించాడు.

లంక తరఫున క్రికెట్ ఆడడం జీవితంలో అన్నింటికన్నా మధురమైన జ్ఞాపకమని చెప్పాడు. తమ నాయకుడిని ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిప్పారు. 37 ఏళ్ల సంగకు వీడ్కోలు పలికేం దుకు లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే, మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, సునీల్ గవాస్కర్ హాజరయ్యారు. అంతకుముందు మ్యాచ్ ముగిసిన అనంతరం భారత క్రికెట్ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని కెప్టెన్ కోహ్లి.. సంగక్కరకు అందించాడు. సంగక్కర భావోద్వేగ వీడ్కోలు ప్రసంగం అతడి మాటల్లోనే...
 
అందరికీ కృతజ్ఞతలు: నాకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని, కుటుంబసభ్యులకు, భారత, లంక జట్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నా క్రికెట్ కెరీర్ ఆరంభానికి  క్యాండీలోని ట్రినిటీ కాలేజి ఎంతగానో చేయూతనందించింది. ఇక నాకు చాలా మంది కోచ్‌లున్నారు. ఎందుకంటే నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు మా నాన్న చాలా మంది దగ్గర శిక్షణ ఇప్పించేవాడు.
 
డ్రెస్సింగ్ రూమ్ కబుర్లు మిస్ అవుతా: నా గత కెప్టెన్లు, తోటి ఆటగాళ్లు నా అభివృద్ధికి తోడ్పడినవారే. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి కబుర్లను ఎంతగానో మిస్ అవుతాను. నాది అద్భుతమైన కుటుంబం. 30 ఏళ్లుగా నన్ను అభిమానించిన వారంతా మ్యాచ్ చివరి రోజు హాజరయ్యారు. ఇదే నేను సాధించిన గొప్ప ఘనత. చాలా మంది జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరని అడుగుతుంటారు. నిజానికి దీని కోసం నేనెక్కడా చూసింది లేదు. నా తల్లిదండ్రులే నన్ను విపరీతంగా ప్రభావితం చేశారు. ఈ కుటుంబంలో పుట్టడం నా అదృష్టం.
 
అభిమానులకు రుణపడి ఉంటా:
లంక తరఫున ఇన్నేళ్లుగా ఆడేందుకు నాకు మనోధైర్యాన్నిచ్చిన అభిమానులకు ఎంతగానో రుణపడి ఉంటాను. నా గురించి మాట్లాడిన విరాట్ కోహ్లి, భారత జట్టుకు కూడా అభినందనలు. చాలా ఏళ్లుగా ఆ జట్టు లంకకు పటిష్ట ప్రత్యర్థిగా ఉంది. ఈరోజు మేం ఓడిపోయినందుకు ఏమీ బాధపడడం లేదు. తర్వాతి మ్యాచ్ మేమే గెలుస్తాం. లంక జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దేశం గర్వించేలా ఆడుతుందని ఆశిస్తున్నాను.
 
జహీర్, స్వాన్ బౌలింగ్‌లో కష్టపడ్డా: ఈ సిరీస్‌లో అశ్విన్ నన్ను ఇబ్బంది పెట్టినా ఓవరాల్‌గా నా కెరీర్‌లో పేసర్ జహీర్ ఖాన్, ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ బౌలింగ్ సవాల్‌గా నిలిచింది. నేను యువకుడిగా ఉన్నప్పుడు వసీం అక్రమ్ బంతులను ఎదుర్కోవడంలోనూ ఇబ్బంది పడ్డా.
 
హైకమిషనర్ పదవిపై ఆలోచిస్తా...

కుమార సంగక్కరకు ఇంగ్లండ్‌లో శ్రీలంక హైకమిషనర్ పదవిని అధ్యక్షుడు సిరిసేన ఆఫర్ చేశారు. అయితే దీనిపై ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటానని సంగక్కర చెప్పాడు. ‘అధ్యక్షుడి విజ్ఞప్తిని నేను గౌరవిస్తాను. ఈ విషయం గురించి ఆయనతో లోతుగా చర్చించాల్సి ఉంది. ఎందుకంటే అలాంటి అనుభవం నాకు లేదు. ఆ పదవికి ప్రత్యేక పరిజ్ఞానం అవసరం. అందుకే ఆలోచించాకే తుది నిర్ణయం తీసుకుంటాను’ అని సంగ అన్నాడు.
 
లంక దిగ్గజం సంగక్కర ఆడిన శకంలోనే తాను కూడా క్రికెట్ ఆడినందుకు గర్వపడుతున్నానని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘ఓ వ్యక్తిగానే కాకుండా క్రికెటర్‌గా నీగురించి చెప్పడానికి మాటలు లేవు. చాలామందికి ప్రేరణగా నిలిచావు. నీ శకంలోనే నేను కూడా ఆడుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అని కోహ్లి చెప్పాడు.
 
 
మాజీ ఆటగాళ్ల క్లబ్‌కు స్వాగతం: గవాస్కర్
సంగక్కర జీవితంలో రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ కోరుకున్నారు. ‘క్రికెట్‌లో సాగించిన ఇన్నింగ్స్‌కంటే రెండో ఇన్నింగ్స్ ఇంకా బాగా సాగాలి. ఇన్నేళ్లుగా లంక ఆశలను సమర్థవంతంగా మోశావు. చివరిగా మాజీ ఆటగాళ్ల క్లబ్‌కు నీకు స్వాగతం పలుకుతున్నాను’ అని గవాస్కర్ అన్నారు.
 
గొప్ప ఆటగాడు: ఐసీసీ

గత 15 ఏళ్లుగా సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ అన్నారు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, ఆటగాడిగా జట్టుకు అతడు అందించిన సేవలను తక్కువగా చూడలేమని కొనియాడారు.

మరిన్ని వార్తలు