వీడియో వైరల్: ఫోన్ పగలగొట్టిన సంగక్కర..!

14 Jul, 2017 16:01 IST|Sakshi
వీడియో వైరల్: ఫోన్ పగలగొట్టిన సంగక్కర..!

లండన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి రెండు సంత్సరాలు అయినా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన బ్యాటింగ్ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ టీ20 టోర్నీలో సర్రే-మిడిల్ సెక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సంగక్కర తన బ్యాటును ఝులిపించాడు. 6 ఫోర్లు, 3 సిక్సులతో 70 పరుగులు బాదిన ఈ 40 ఏళ్ల లంక మాజీ ఆటగాడు ఓ సిక్స్ తో అభిమాని ఫోన్ పగలగొట్టాడు.

స్టీవెన్ ఫిన్ ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని సంగక్కర భారీ షాట్ తో సిక్స్ గా మలిచాడు. ఈ బంతిని అందుకోవడానికి ఆతృత చూపిన ఓ అభిమాని చేతిలో ఫోన్ తో క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. దీంతో బంతి మొబైల్ కు తగిలి కింద పడిపోయింది. వెంటనే ఫోన్ అందుకున్న ఆ అభిమాని పగిలిపోయిన ఫోన్ చూపిస్తూ ఆశ్ఛర్యం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  2015లో టెస్టు క్రికెట్ కు సంగక్కర వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 134 టెస్టుల్లో 57.40 సగటుతో 12,400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఏడాది నుంచి సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇక సంగక్కర శ్రీలంక గెలిచిన 2014 టీ20 వరల్డ్ కప్ జట్టులో ,2007 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరిన జట్టులో కీలక ఆటగాడు. అంతేగాకుండా సంగక్కర కెప్టెన్సీలో శ్రీలంక 2011 వరల్డ్  కప్ ఫైనల్ కు చేరింది. 2015లో వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగక్కర అంతర్జాతీయ టీ20 చివరి మ్యాచ్ ను 2014లో భారత్ తో ఆడాడు.