సంగక్కర మరో సెంచరీ

8 Feb, 2014 01:30 IST|Sakshi
సంగక్కర మరో సెంచరీ

చిట్టగాంగ్: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర (144 బంతుల్లో 105; 11 ఫోర్లు; 2 సిక్స్‌లు) అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టిన తను రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగించి శతకాన్ని సాధించాడు.
 
  దీంతో ఈ ఘనత (ఒకే మ్యాచ్‌లో ట్రిపుల్, సెంచరీ) సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. గతంలో గ్రాహం గూచ్ (333, 123) 1990లో లార్డ్స్‌లో భారత్‌పై ఈ ఘనత సాధించాడు. సంగతో పాటు దినేష్ చండిమాల్ (158 బంతుల్లో 100 నాటౌట్; 4 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో రెండో ఇన్నింగ్స్‌లో లంక 75.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 305 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.
 
 దీంతో బంగ్లాదేశ్ ముందు 467 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగోరోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి బంగ్లా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (7 బ్యాటింగ్), రహమాన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు (శనివారం) ఆటకు చివరి రోజు. అంతకుముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 119.5 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. తమ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 17 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. మెండిస్‌కు ఆరు, పెరీరాకు మూడు వికెట్లు దక్కాయి.
 

whatsapp channel

మరిన్ని వార్తలు