కుశాగ్ర మోహన్‌ గెలుపు

20 Sep, 2018 10:10 IST|Sakshi

అంతర్జాతీయ చెస్‌ టోర్నీ షురూ

కవాడిగూడ: అంతర్జాతీయ ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ చెస్‌ టోర్నీ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. హోటల్‌ మారియట్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్, క్యాండిడేట్‌ మాస్టర్‌ కుశాగ్ర మోహన్‌ శుభారంభం చేశాడు. తొలిరౌండ్‌ గేమ్‌లో వశిష్ట రమణరావు (తెలంగాణ)పై కుశాగ్ర మోహన్‌ విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో అద్రిజా సిన్హా (అస్సాం)పై ఫిడే మాస్టర్‌ మట్టా వినయ్‌ కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌), సెరా డగారియా (మధ్యప్రదేశ్‌)పై జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్‌), మీర్‌ మాహిర్‌ అలీ (తెలంగాణ)పై వెంకట కృష్ణ కార్తీక్‌ (ఆంధ్రప్రదేశ్‌) విజయం సాధించారు.

అంతర్జాతీయ మాస్టర్లు కె. రత్నాకరన్‌ (కేరళ), రవితేజ (ఆంధ్రప్రదేశ్‌), సమీర్‌ (మహారాష్ట్ర), శరవణ కృష్ణన్‌ (తమిళనాడు), సంగ్మా రాహుల్‌ (ఢిల్లీ)... గ్రాండ్‌మాస్టర్లు ఘోష్‌ దీప్తయాన్‌ (పశ్చిమ బెంగాల్‌), దీపన్‌ చక్రవర్తి (ఐసీఎఫ్‌), లక్ష్మణ్‌ (ఐసీఎఫ్‌), శ్రీరామ్‌ ఝా (ఢిల్లీ) ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా తమ ప్రత్యర్థులపై గెలుపొందారు. ఈనెల 23 వరకు జరుగనున్న ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా 280 మంది క్రీడాకారులు తలపడుతున్నారు. 85 ఏళ్ల టి.వి సుబ్రమణియన్‌ టోర్నీలో అతిపెద్ద వయస్కుడు కాగా... 4 ఏళ్ల చిన్నారి సంహిత (తెలంగాణ) అతి పిన్న వయస్కురాలు. పోటీలకు ముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టెట్రాసాఫ్ట్‌ సంస్థ ఉపాధ్యక్షులు జయపాల్‌ రెడ్డి, సురేన్‌... డైరెక్టర్లు దుర్గా ప్రసాద్, విజయ్, శ్రీనివాస్, సురేష్, అనిల్, దీప్తి, శ్రీకాంత్, ప్రవీణ్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు