క్విటోవా తొలిసారి..

24 Jan, 2019 11:59 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్‌ సీడెడ్‌ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్‌(అమెరికా)పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఇరువురి మధ్య తొలి సెట్‌ హోరా హోరీగా సాగగా, రెండో సెట్‌ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా గెలుపొందగా, రెండో సెట్‌లో కూడా అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరారు. దాంతో 28 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్‌ రిపబ్లికన్‌ క్రీడాకారిణిగా క్విటోవా గుర్తింపు పొందారు. అంతకుముందు 1991లో జోనా నవోత్నా చివరిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన చెక్‌ రిపబ్లికన్‌ క్రీడాకారిణి కాగా, ఇప్పుడు క్విటోవా ఆమె సరసన చేరారు.

మ్యాచ్‌లో విజయం తర్వాత క్విటోవా మాట్లాడుతూ..‘ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఫైనల్లో ఏమి జరిగినా ప్రస్తుత గెలుపును ఎక్కువగా ఆస్వాదిస్తున్నా.  తొలి సెట్‌లో కొలిన్స్‌ను తీవ్ర పోటీ ఎదుర్కొన్నా. దాంతో ఓ దశలో ఒత్తిడికి లోనయ్యా. కానీ ఒత్తిడిని తట్టుకోవడంతో టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను గెలిచా. ఇక రెండో సెట్‌లో ఎటువంటి పొరపాట్లు చేయకపోవడంతో కొలిన్స్‌ను ఓడించి తుది బెర్తును ఖాయం చేసుకున్నా’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు