ఢిల్లీ ఢమాల్‌

2 Apr, 2019 01:07 IST|Sakshi

స్యామ్‌ కరన్‌ హ్యాట్రిక్‌

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ 

14 పరుగులతో పంజాబ్‌ విజయం

పంజాబ్‌పై 167 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో ఢిల్లీ స్కోరు 16.3 ఓవర్లలో 144/3... అయితే 17 బంతులు ముగిసేసరికి ఆటంతా మారిపోయింది. కేవలం 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి 19.2  ఓవర్లలో 152 పరుగుల వద్ద ఆలౌటైంది! సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ 14 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై ఊహించని విజయాన్ని సాధించింది. అద్భుత బౌలింగ్‌తో హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లు తీసిన స్యామ్‌ కరన్‌ ఢిల్లీ  పతనాన్ని శాసించాడు.   

మొహాలి: ఐపీఎల్‌లో పంజాబ్‌ వరుస విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ (30 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (29 బంతుల్లో 39; 6 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌  (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇంగ్రామ్‌ (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. హ్యాట్రిక్‌తో చెలరేగిన స్యామ్‌ కరన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌ల హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ గాయంతో ఈ మ్యాచ్‌ ఆడలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతని స్థానంలో కరన్‌ బరిలోకి దిగాడు. 

ధాటిగా ఆడిన మిల్లర్, సర్ఫరాజ్‌ 
టాస్‌ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గేల్‌ లేని పంజాబ్‌ ఇన్నింగ్స్‌ కళ తప్పింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ఓపెనర్లు కె.ఎల్‌.రాహుల్‌ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కరన్‌ (10 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌)  తమ ధాటిని ఎంతోసేపు కొనసాగించలేకపోయారు. మోరిస్‌ బౌలింగ్‌లో రాహుల్, లమిచానే బౌలింగ్‌లో కరన్‌ ఎల్బీగా నిష్క్రమించారు. తర్వాత వచ్చిన మయాంక్‌ అగర్వాల్‌ (6) విఫలమయ్యాడు.  

ఆకట్టుకున్న సర్ఫరాజ్‌ 
ఈ దశలో సర్ఫరాజ్‌ ఖాన్, మిల్లర్‌ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు బౌండరీలతో పంజాబ్‌ను నడిపించారు. నాలుగో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. సర్ఫరాజ్‌ చూడచక్కని స్ట్రోక్స్‌తో అలరించాడు. జట్టు స్కోరు 120 పరుగులు చేరాక, మొదట సర్ఫరాజ్, కాసేపటికి మిల్లర్‌ పెవిలియన్‌ చేరారు. మళ్లీ మోరిస్, లమిచానే కీపర్‌ క్యాచ్‌లతో  వీళ్లిద్దరి ఆటకట్టించారు. ఇంతటితో పంజాబ్‌కు ఆ కాస్త మెరుపులు కూడా మాయమయ్యాయి. తర్వాత  మన్‌దీప్‌ సింగ్‌ (21 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే మెరుగనిపించాడు.  

పృథ్వీ షా డకౌట్‌ 
గత మ్యాచ్‌లో పరుగు తేడాతో సెంచరీని కోల్పోయిన ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా (0) ఈ మ్యాచ్‌లో పరుగైనా చేయకుండా అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలిబంతికే నిష్క్రమించాడు. ఓపెనర్‌ ధావన్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అడపాదడపా ఫోర్లు కొడుతూ రెండో వికెట్‌కు 7.1 ఓవర్లలో 61 పరుగుల్ని జోడించారు. శ్రేయస్‌ (22 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను బౌల్డ్‌ చేసి విలోన్‌ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కాసేపటికే ధావన్‌ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు)ను అశ్విన్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు.  

కరన్‌ ‘హ్యాట్రిక్‌’... క్యాపిటల్స్‌ ఆలౌట్‌ 
ఇక్కడి నుంచి రిషభ్‌ పంత్, ఇంగ్రామ్‌లు ఢిల్లీని నడిపించారు. పంత్‌ మొదట అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. ఆ మరుసటి ఓవర్‌ షమీ వేయగా సిక్స్‌తో అలరించాడు. కానీ తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. ఇక్కడి నుంచి క్యాపిటల్స్‌ పతనం మొదలైంది. షమీ ఓవర్లోనే మోరిస్‌ (0) రనౌట్‌ కాగా.. కరన్‌ నిప్పులు చెరిగే బౌలింగ్‌లో ఇంగ్రామ్, హర్షల్‌ (0) కూడా ఔటయ్యారు. 12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో విహారి (2) చేతులెత్తేశాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ చివరి బంతికి హర్షల్‌ను ఔట్‌ చేసిన కరన్‌... 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకి రబడ (0), లమిచానే (0)లను క్లీన్‌బౌల్డ్‌ చేసి ఈ సీజన్‌లో తొలి ‘హ్యాట్రిక్‌’ను నమోదు చేశాడు.   

►ఐపీఎల్‌లో ఇది 17వ హ్యాట్రిక్‌ కాగా...అతి పిన్న వయసులో  (20 ఏళ్ల 302) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కరన్‌ నిలిచాడు.    

మరిన్ని వార్తలు