కాంస్యంతో సరి

19 Nov, 2018 01:03 IST|Sakshi

సెమీస్‌లో ఓడిన లక్ష్య సేన్‌

 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో పతకం గెలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా లక్ష్యసేన్‌ గుర్తింపు పొందాడు. గతంలో సమీర్‌ వర్మ (2011లో), సాయిప్రణీత్‌ (2010లో), ప్రణయ్‌ (2010లో), గురుసాయిదత్‌ (2008లో) కాంస్య పతకాలు నెగ్గగా... సిరిల్‌ వర్మ (2015లో) రజత పతకం సాధించాడు. జూనియర్‌ మహిళల సింగిల్స్‌లో మాత్రం సైనా స్వర్ణం (2008లో), కాంస్యం (2006లో) గెల్చుకుంది.

మార్క్‌హామ్‌ (కెనడా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్‌ రైజింగ్‌ స్టార్‌ లక్ష్య సేన్‌ కీలక పోరులో తడబడ్డాడు. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అండర్‌–19 పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఆసియా జూనియర్‌ చాంపియన్‌ లక్ష్య సేన్‌ 22–20, 16–21, 13–21తో డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన లక్ష్య సేన్‌ రెండో గేమ్‌లో గతి తప్పాడు. ఈ ఏడాది ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో కున్లావుత్‌ను ఓడించిన లక్ష్య సేన్‌ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో సఫలం కాలేదు.

రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచిన కున్లావుత్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో మరింత జోరు పెంచగా... లక్ష్య సేన్‌ ప్రత్యర్థికి సరైన సమాధానం ఇవ్వలేక పోయాడు. ఈ గెలుపుతో ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ చేతిలో ఎదురైన ఓటమికి కున్లావుత్‌ బదులు తీర్చుకున్నాడు. ‘నేను సహజశైలిలో ఆడలేకపోయాను. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాను. రెండో గేమ్‌ నుంచి కున్లావుత్‌కు సరైన పోటీనివ్వలేకపోయాను’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన 17 ఏళ్ల లక్ష్య సేన్‌ వ్యాఖ్యానించాడు.  

మరిన్ని వార్తలు