మళ్లీ కాంస్యంతో సరి 

16 Feb, 2020 08:34 IST|Sakshi

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో భారత్‌ పరాజయం

ఆసియా క్రీడల చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీపై లక్ష్య సేన్‌ విజయం  

మనీలా (ఫిలిప్పీన్స్‌): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరే అవకాశాన్ని భారత్‌ రెండోసారి చేజార్చుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇండోనేసియాతో శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 2–3తో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 2016లోనూ భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఇండోనేసియా చేతిలో ఓటమిపాలై కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆంథోని జిన్‌టింగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ సాయిప్రణీత్‌ తొలి గేమ్‌ను 6–21తో చేజార్చుకున్నాక గాయం కారణంగా వైదొలిగాడు.

అనంతరం రెండో సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ అద్భుతంగా ఆడి 21–18, 22–20తో ఆసియా క్రీడల చాంపియన్, ప్రపంచ ఏడో ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. దాంతో భారత్‌ 1–1తో స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో అహసాన్‌–సెతియవాన్‌ (ఇండోనేసియా) ద్వయం 21–10, 14–21, 23–21 అర్జున్‌–ధ్రువ్‌ కపిల జంటను ఓడించింది. నాలుగో మ్యాచ్‌లో శుభాంకర్‌ డే 21–17, 21–15తో రుస్తావిటోను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జంట గిడియోన్‌–సుకముల్జో 21–6, 21–13తో లక్ష్య సేన్‌–చిరాగ్‌ శెట్టి జోడీని ఓడించి ఇండోనేసియాకు 3–2తో విజయాన్ని అందించింది.   

మరిన్ని వార్తలు