‘ఆ ముగ్గురు’ పశ్చాత్తాప పడి ఉంటారు 

30 Jun, 2020 00:20 IST|Sakshi

2007 టి20 ప్రపంచకప్‌ విజేత భారత జట్టు మేనేజర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ వ్యాఖ్య

ముంబై: ఎమ్మెస్‌ ధోని నేతృత్వంలో 2007 టి20 ప్రపంచకప్‌ గెలిచి భారత జట్టు సంచలనం సృష్టించింది. అయితే ఈ మెగా టోర్నీలో ఆడరాదని నాటి సీనియర్లు సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ అంతకు కొద్దిరోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. ఫలితంగా ధోని కెప్టెన్‌గా యువ జట్టు బరిలోకి దిగింది. దీనికి సంబంధించిన మరో ఆసక్తికర అంశాన్ని ఆ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పంచుకున్నారు. అప్పటి టెస్టు, వన్డే కెప్టెన్‌ ద్రవిడ్‌ తనతో పాటు మిగతా ఇద్దరినీ ఇందు కోసం ఒప్పించాడని ఆయన చెప్పారు.

‘తానే కాదు... సచిన్, గంగూలీ కూడా టి20 వరల్డ్‌కప్‌ ఆడాల్సిన అవసరం లేదని ద్రవిడ్‌ భావించాడు. తనే స్వయంగా వారికి చెప్పి నిరోధించాడనేది వాస్తవం. దానికి ముందు జరిగిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో ద్రవిడ్‌గా కెప్టెన్‌గా ఉన్నాడు. కొందరు ఆటగాళ్లయితే నేరుగా ఇంగ్లండ్‌ నుంచే వరల్డ్‌కప్‌ కోసం దక్షిణాఫ్రికా వచ్చారు. ఆ సమయంలో కుర్రాళ్లకు చాన్స్‌ ఇద్దామని ద్రవిడ్‌ చెప్పాడు. అయితే మన జట్టు ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత వారంతా కచ్చితంగా పశ్చాత్తాప పడి ఉంటారు. ఎందుకంటే నేను ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఒక్క ప్రపంచకప్‌ కూడా గెలవలేదు అని సచిన్‌ నాతో తరచుగా చెప్పేవాడు’ అని రాజ్‌పుత్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు