లలిత్ మోదీ వారసుడొస్తున్నాడు..

13 Sep, 2016 16:50 IST|Sakshi
లలిత్ మోదీ వారసుడొస్తున్నాడు..

జైపూర్: ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ కుమారుడు రుచిర్ క్రికెట్ రాజకీయాల్లో క్రీయాశీలకం కానున్నాడు. ఇటీవల అల్వార్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన 22 ఏళ్ల రుచిర్.. రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్సీఏ ఎన్నికల్లో గెలిస్తే లలిత్ మోదీ స్థానంలో రుచిర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడు.

ప్రస్తుతం ఆర్సీఏ అధ్యక్షుడు లలిత్ మోదీనే. కాగా ఐపీఎల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోదీ ఆర్సీఏ అధ్యక్షుడు కావడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆర్సీఏను సస్పెండ్ చేసింది. మోదీ పదవి నుంచి తప్పుకున్న తర్వాతే సస్పెన్షన్ను ఎత్తివేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేగాక మూడేళ్లుగా ఆర్సీఏకు అన్ని రకాల నిధులను ఆపివేసింది. ఈ నేపథ్యంలో మోదీ అనుచరులు రుచిర్ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఆర్సీఏ అధ్యక్షుడిగా రుచిర్ ఎన్నికైతే బీసీసీఐ సస్పెన్షన్ను తొలగించకతప్పదని మోదీ మద్దతుదారులు భావిస్తున్నారు. లలిత్ మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉంటున్నాడు.
 

మరిన్ని వార్తలు