నెల వ్యవధిలోనే హెడ్‌ కోచ్‌ అయిపోయాడు!

28 Sep, 2019 12:31 IST|Sakshi

కాబూల్‌: గత నెలలో దక్షిణాఫ్రికా అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించబడ్డ ఆ దేశ మాజీ ఆల్‌ రౌండర్‌ లాన్స్‌ క్లూసెనర్‌కు ఇప్పుడు ప్రమోషన్‌ వచ్చింది. తాజాగా లాన్స్‌ క్లూసెనర్‌ను తమ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమిస్తూ అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అఫ్గాన్‌ క్రికెట్‌ హెడ్‌ కోచ్‌గా పని చేసిన ఫిల్‌ సిమ్మన్స్‌ స్థానంలో క్లూసెనర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. సిమ్మన్స్‌ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఇటీవల కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా అందుకు క్లూసెనర్‌ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న క్లూసెనర్‌ తాను కూడా ఉన్నానంటూ దరఖాస్తు చేశాడు.

అఫ్గాన్‌ హెడ్‌ కోచ్‌ పదవి కోసం అప్లై చేసిన తరుణంలోనే దక్షిణాఫ్రికా అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా క్లూసెనర్‌ ఎంపికయ్యాడు క్లూసెనర్‌.  దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న తరుణంలో ఆగస్టు నెలలో క్లూసెనర్‌కు అసిస్టెంట్‌ బ్యాటింగ్‌ కోచ్‌ పగ్గాలు అప్పచెప్పారు. నెల వ్యవధిలోనే అసిస్టెంట్‌ కోచ్‌ పేరు కాస్త హెడ్‌ కోచ్‌గా మారిపోవడంతో క్లూసెనర్‌ ఉబ్బితబ్బి అయిపోతున్నాడు. ‘నన్ను అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయడం చాలా గర్వంగా ఉంది. వరల్డ్‌ క్రికెట్‌లో అత్యుత్తమ టాలెంట్‌ ఉన్న అఫ్గాన్‌తో కలిసి పని చేయడానికి ఆతృతగా ఉన్నాడు. ఇది నాకు వచ్చిన మంచి అవకాశం. ప్రతీ ఒక్కరికీ ఫియర్‌లెస్‌ బ్రాండ్‌గా ముద్ర పడిన అఫ్గాన్‌ క్రికెట్‌ గురించి తెలుసు. ఆ జట్టును ఉన్నత స్థాయిలో నిలపడమే నా ముందున్న లక్ష్యం’ అని క్లూసెనర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు