ఫిలాండర్‌ను ఇలా దెబ్బకొట్టండి.. లేదంటే మళ్లీ నష్టం!

11 Jan, 2018 19:37 IST|Sakshi

కేప్‌టౌన్‌: ఇటీవల కేప్‌టౌన్‌లో జరిగిన తొలిటెస్టులో భారత క్రికెట్‌ జట్టు పతనాన్ని శాసించాడు దక్షిణాఫ్రికా పేసర్‌ వెర్నాన్‌ ఫిలాండర్‌. ముఖ్యంగా కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో 6/42తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు ఫిలాండర్‌. స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ గాయం కారణంగా టెస్టు మధ్యలోనే వైదొలిగినా.. ఫిలాండర్‌ చెలరేగడంతో సఫారీలకు ఆ లోటు తెలియలేదు. అయితే రెండో టెస్టులో విజయం సాధించి కేప్‌టౌన్‌ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోన్న విరాట్‌ కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌ రౌండర్‌ లాన్స్‌ క్లూసెనర్‌ కొన్ని విలువైన చిట్కాలు చెప్పాడు.

వైవిధ్యమైన బంతులతో తొలిటెస్టులో ఇబ్బంది పెట్టిన పేసర్‌ ఫిలాండర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలుపట్టుకుంటున్న భారత బ్యాట్స్‌మెన్లకు క్లూసెనర్‌ సూచనలు ఫలితాన్ని ఇవ్వనున్నాయి. అత్యంత వేగంగా బంతులు సంధించే బౌలర్లను ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి ఆటగాళ్లు క్రీజు నుంచి బయటకు వచ్చి ఆడటం ఉత్తమమని చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మీటరు దూరం వరకు క్రీజునుంచి ముందుకొచ్చి ఫిలాండర్‌ బంతులను ఎదుర్కొంటే ఔటయ్యే సమస్యకు దూరంగా ఉంటూ పరుగులు సాధించవచ్చునని సూచించాడు. కనీసం అరమీటరు ముందుకొచ్చి స్టాన్స్‌ తీసుకుని పేసర్ల బంతులు ఆడితే బౌలర్ల లయ దెబ్బతిని షార్ట్‌ లెంగ్త్‌తో బంతులు వేస్తారు. మిగతా రెండు టెస్టులు ఆడే బౌన్సీ పిచ్‌లపై తన చిట్కాలు ఆచరించినా దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొని విజయం సాధిస్తారన్న నమ్మకం లేదన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ అతికష్టమ్మీద 1-0తో ఔటమితో గానీ లేక 1-1తో సిరీస్‌ సమం చేయొచ్చునని క్లూసెనర్‌ అభిప్రాయపడ్డాడు. 

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై క్లూసెనర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆధునిక క్రికెట్‌లో హార్దిక్‌ తనదైన మార్కును చూపిస్తూ భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడంటూ కొనియాడాడు. భారత క్రికెట్‌ జట్టకు దొరికిన ఒక వరంగా హార్దిక్‌ను అభివర్ణించాడు. పేస్‌ బౌలింగ్‌లో ఇంకా వైవిధ్యాన్ని కనబరిస్తే ప్రపంచ అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌గా ఎదుగుతాడని క్లూసెనర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు