అప్పుడు కోహ్లి.. ఇప్పుడు స్మిత్‌

6 Aug, 2019 16:31 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని గతంలో చెప్పానని, కానీ స్టీవ్‌ స్మిత్‌ తాజా ప్రదర్శన దానికి మించి ఉందని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌ తొలి టెస్ట్‌లో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్మిత్‌ 144,142 వీరోచిత సెంచరీలతో ఆస్ట్రేలియాకు ఘన విజయాన్నందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మిత్‌పై ఆసీస్‌ కోచ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ వేసవికాలంలో విరాట్‌ కోహ్లి వంటి గొప్ప ఆటగాడిని ఎప్పుడూ చూడలేదన్నాను. కానీ స్మిత్‌ తాజా ఇన్నింగ్స్‌ ఆ స్థాయికి మించి ఉంది.

సమకాలిన క్రికెట్‌లో ఒత్తిడిని జయిస్తూ 60 సగటుతో ఆడే స్మిత్‌లాంటి ఆటగాడిని ఇప్పటి వరకు చూసుండరు. ఇది కేవలం అతని నైపుణ్యం మాత్రమే కాదు. అపారమైన సాహసం, విశాలమైన వ్యక్తిత్వం, ధైర్యం, మొక్కవోని దీక్ష, శారీరక ధృడత్వం, మెంటల్ స్టామినా అన్ని కలగలివడం వల్లే ఇది సాధ్యమైంది.’ అని లాంగర్‌ స్మిత్‌ కొనియాడాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ నిషేధం అనంతరం బరిలోకి దిగిన తొలి టెస్ట్‌లోనే స్మిత్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చీటర్స్‌ అంటూ సాండ్‌ పేపర్స్‌తో ఎగతాళి చేసిన ఇంగ్లండ్‌ ప్రేక్షకులకు తన ఆటతోనే సమాధానమిచ్చాడు. 

మరిన్ని వార్తలు