ఇక ఆటమీదే మనసు పెట్టాలి!

23 Dec, 2018 01:21 IST|Sakshi

జట్టులో అభిప్రాయ భేదాలు సహజం

మిథాలీ రాజ్‌ వ్యాఖ్యలు

కోల్‌కతా: గతాన్ని మరిచి మళ్లీ క్రికెట్‌ మీదే దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత మహిళల వన్డే సారథి మిథాలీరాజ్‌ తెలిపింది. కొత్త కోచ్‌ నియామకంతో కోచ్‌ రమేశ్‌ పొవార్‌తో వివాదం ముగిసిన అధ్యాయమని ఆమె పేర్కొంది. మహిళల సెలక్షన్‌ కమిటీ కివీస్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన వన్డే, టి20 జట్లలో మిథాలీకి సముచిత గౌరవం ఇచ్చిన సంగతి తెలిసిందే. వన్డేల్లో ఆమె సారథ్యంపై నమ్మకముంచిన సెలక్టర్లు టి20 జట్టులోనూ ఆమెను కొనసాగించారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఇక్కడికొచ్చిన ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘ ఈ వివాదం చేదు అనుభవాన్నిచ్చింది. ఇది మా అందరినీ బాగా ఇబ్బందిపెట్టింది. ఇప్పుడైతే అంతా కుదుటపడింది. ఇక పూర్తిగా ఆటపై, జట్టుపై దృష్టిపెడతా’ అని మిథాలీ చెప్పింది. ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్‌కు పక్కనబెట్టడం తనను, తన కుటుంబసభ్యుల్ని తీవ్రంగా బాధించిందని వివరించింది. 

‘తుది జట్టులో చోటు, కోచ్‌తో వివాదం ఇంత పెద్దదవడం మహిళల క్రికెట్‌కు మంచిది కాదు. ఆటతీరు కంటే క్రికెటేతర అంశాలే చర్చనీయాంశం కావడం... ఆటకు ఇబ్బందికరం. కివీస్‌ పర్యటన కోసం సన్నద్ధం కావాలి. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలి’ అని హైదరాబాదీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ చెప్పింది. కోచ్‌ పొవార్‌పై మిథాలీ ఆవేదన వ్యక్తం చేయగా, మరోవైపు టి20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధానలు కోచ్‌కు మద్దతివ్వడంతో జట్టు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలొచ్చాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ క్రికెటర్లు, సహాయ సిబ్బంది అంతా కలిసి ఓ క్రికెట్‌ కుటుంబంగా మెలుగుతామని, అయితే అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు రావడం సహజమని చెప్పింది. ‘ఒక కుటుంబంలో అందరూ ఒకేలా ఆలోచించరు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే ఆట ముందు ఇవన్నీ పెద్ద సమస్యలేమీ కావు. మా ప్రాధాన్యం క్రికెటే. ఓసారి బరిలోకి దిగగానే ఆటే మా సర్వస్వమవుతుంది. ఆటలో నెగ్గేందుకు అంతా ఒక్కటవుతాం. అప్పుడు జట్టే కనిపిస్తుంది. మంచి ప్రదర్శనే మా లక్ష్యమవుతుంది. ఇతరత్రా అంశాలేవీ గుర్తుండవు’ అని మిథాలీరాజ్‌ తెలిపింది. కొత్త కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌పై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని, అయితే ఆయనను ఇంతకుముందు జాతీయ క్రికెట్‌ అకాడమీలో కలిశానని పేర్కొంది. 2007లో కివీస్‌ పర్యటనకు వెళ్లిన అనుభవం తనకు, జులన్‌కి మాత్రమే ఉందని, ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌ తమకు చాలా ముఖ్యమైందని ఆమె చెప్పింది.   

మరిన్ని వార్తలు