బంగ్లాతో ఆఖరి వన్డే రద్దు

20 Jun, 2014 01:02 IST|Sakshi
బంగ్లాతో ఆఖరి వన్డే రద్దు

2-0తో సిరీస్ భారత్ కైవసం
 
 మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. గురువారం షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగాల్సిన చివరిదైన మూడో వన్డే కాస్త జరిగాక వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను 9, 13వ ఓవర్ల సమయంలో వరుణుడు అడ్డుకున్నాడు. దీంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. అయితే 34.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 119 పరుగులు చేసిన సమయంలో మరోసారి భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలు వేచి చూసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

రెండో వన్డేలాగే ఈ మ్యాచ్‌లోనూ బంగ్లా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. పుజారా (63 బంతుల్లో 27; 2 ఫోర్లు), రైనా (25 బంతుల్లో 25; 3 ఫోర్లు), బిన్నీ (36 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) మాత్రమే రాణించారు. 16 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఏ సమయంలోనూ కోలుకోలేకపోయింది. ఐదో వికెట్‌కు రైనా, పుజారా మధ్య నెలకొన్న 41 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం. చివర్లో బిన్నీ వేగంగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. షకీబ్‌కు మూడు వికెట్లు, తస్కిన్, అల్ అమీన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్టువర్ట్ బిన్నీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
 
స్కోరు వివరాలు

భారత్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) నాసిర్ హుస్సేన్ (బి) మొర్తజా 5; రహానే (సి) నాసిర్ హుస్సేన్ (బి) అల్ అమిన్ 3; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) షకీబ్ 27; రాయుడు (సి) రహీమ్ (బి) తస్కిన్ 1; తివారి (సి) అనముల్ హక్ (బి) అల్ అమిన్ 2; రైనా (సి) ముష్ఫికర్ (బి) షకీబ్ 25; సాహా (బి) షకీబ్ 16; బిన్నీ నాటౌట్ 25; పటేల్ (సి) ముష్ఫికర్ (బి) తస్కిన్ 1; మోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) సొహాగ్ 1; ఉమేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 10) 13; మొత్తం (34.2 ఓవర్లలో 9 వికెట్లకు) 119.
 వికెట్ల పతనం: 1-8; 2-8; 3-13; 4-16; 5-57; 6-89; 7-90; 8-97; 9-119.
 బౌలింగ్: మొర్తజా 8-1-25-1; అల్ అమిన్ 6-1-23-2; తస్కిన్ 8-1-15-2; షకీబ్ 7.2-0-27-3; నాసిర్ 2-0-14-0; సొహాగ్ 2-0-7-1; మహ్ముదుల్లా 1-0-5-0.
 
 
 

మరిన్ని వార్తలు