‘పంత్‌ను పంపండం సరైనది కాదు’

23 Sep, 2019 14:41 IST|Sakshi

వీవీఎస్‌ లక్ష్మణ్‌

బెంగళూరు : కీలక నాలుగో స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ను బ్యాటింగ్‌కు పంపండం సరైన నిర్ణయం కాదని టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ మరోసారి విపలమైన విషయం తెలిసిందే. దీంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పంత్‌కు లక్ష్మణ్‌ అండగా నిలిచాడు. ఎంఎస్‌ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన పంత్‌పై అధిక ఒత్తిడి ఉందని.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడిలో స్థైర్యాన్ని నింపాలన్నాడు. పంత్‌లో అపార ప్రతిభ దాగుందన్నాడు. మైదానం అన్నివైపులా షాట్‌లు కొట్టగల నైపుణ్యం ఉందని.. దూకుడు అతడి సొంతమని ప్రశంసించాడు. అయితే ఆటలో లోపం లేదని.. షాట్ల ఎంపికలోనే లోపం ఉందని అభిప్రాయపడ్డాడు. 

పంత్‌ బ్యాటింగ్‌ సహజ లక్షణం దూకుడని అలాంటి ఆటగాడిని నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేక ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపాలని సూచించాడు. అయితే ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనేక విజయాలు అందించిన పంత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించకపోవడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఈ 21ఏళ్ల యువ క్రికెటర్‌కు కుదురుకునే అవకాశం ఇవ్వాలన్నాడు. అప్పటివరకు నాలుగో స్థానంలో కాకుండా ఐదు లేక ఆరు స్థానాంలో బ్యాటింగ్‌కు పంపాలన్నాడు.  ఇక నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ లేక హార్దిక్‌ పాండ్యాలను పంపించాలని సూచించాడు. ఇక ఆదివారం జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. 

Poll
Loading...
మరిన్ని వార్తలు