‘గంగూలీ రూమ్‌లోకి వెళ్లి షాకయ్యా’

26 Oct, 2019 16:39 IST|Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్‌ గంగూలీని క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) సన్మానించిన కార్యక్రమానికి హాజరైన మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన గత అనుభవాల్ని నెమరువేసుకున్నాడు. 2014లో క్యాబ్‌ జాయింట్‌ సెక్రటరీగా గంగూలీ పనిచేస్తున్న సమయంలో లక్ష్మణ్‌.. బెంగాల్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలందించాడు. దీనిలో భాగంగా గంగూలీని కలవడానికి వెళ్లిన లక్ష్మణ్‌కు ఊహించని పరిణామం ఎదురైందట. క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగి, భారత క్రికెట్‌ను ఒక ఉన్నత స్థాయిలో నిలిపిన కెప్టెనే కాకుండా, వరల్డ్‌ క్రికెట్‌లో ఒక లెజెండ్‌ అయినటువంటి గంగూలీని ఆ రూమ్‌లో చూసి లక్ష్మణ్‌ షాక్‌ తిన్నాడట.

‘ నేను బెంగాల్‌ బ్యాటింగ్‌ కన్సల‍్టెంట్‌గా గంగూలీని కలవడానికి వెళ్లా. ఆ సమయంలో రాష్ట్ర అసోసియేషన్‌లోని ఒక చిన్నగదిలో గంగూలీ కూర్చొని ఉన్నాడు. ఆ రూమ్‌ నన్ను కచ్చితంగా షాక్‌కు గురి చేసింది. అది చాలా చిన్నరూమ్‌. అందులో క్రికెట్‌  అడ్మినిస్ట్రేటర్‌గా గంగూలీ సేవలందిస్తున్నాడు. ఇది నాకు ఊహించని విషయం. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యా. కానీ అది నాలో స్ఫూర్తిని నింపింది’ అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్‌తో పాటు అజహరుద్దీన్‌ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు