రియో ఒలింపిక్స్ లో సానియాతో జోడీకి ఓకే!

4 Jan, 2016 21:19 IST|Sakshi

చెన్నై: ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్నరియో ఒలింపిక్స్ క్రీడలకు ఆటగాళ్ల ఎంపికలో రాజకీయాలకు తావుండరాదని భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ఎంపిక వివాదాలను ఈసారి  సృష్టించకూడదని, మెన్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో తనతో జట్టు కట్టడానికి రోహన్ బోపన్న, సానియా మీర్జా అర్హులని ఆయన పేర్కొన్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో పేస్ తో జతకట్టి ఆడటానికి బోపన్న, మహేశ్ భూపతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్న పేస్ అప్పట్లో చెత్త రాజకీయాలకు పాల్పడ్డారని, ఈసారి అలా జరుగకూడదని అన్నారు.

'డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కు సంబందించిన ఆనాటి ఘటన పునరావృతం కాబోదని ఆశిస్తున్నా.  ప్రతిభ ఆధారంగానే సెలక్షన్ జరుగాలి. 2015లో నేను మూడు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ గెలుపొందాను.  కాబట్టి రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత మిక్స్డ్ డబుల్స్ బృందంలో నేను ముందంజలో ఉంటానని భావిస్తున్నాను' అని పేస్ చెప్పారు.  చెన్నై ఓపెన్ లో పాల్గొనడం ద్వారా 2016లో తన ఆటను మొదలుపెట్టిన పేస్ ప్రధానంగా రియో ఒలింపిక్స్ పై దృష్టి పెట్టినట్టు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో భారత తరఫున డబుల్స్ లో బోపన్నతో, మిక్స్డ్ డబుల్స్ లో సానియాతో జత కట్టాలని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు