‘ఆ ముగ్గురు’ కలిసి పని చేయాలి!

19 Feb, 2019 04:32 IST|Sakshi

భారత టెన్నిస్‌పై బెకర్‌ వ్యాఖ్య

మొనాకో: ఈతరం భారత టెన్నిస్‌ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలంటే ముగ్గురు దిగ్గజాలు లియాండర్‌ పేస్, మహేశ్‌ భూపతి, సానియా మీర్జా కలిసి పని చేయాలని మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, జర్మన్‌ స్టార్‌ బోరిస్‌ బెకర్‌ అభిప్రాయపడ్డాడు. టెన్నిస్‌ అభివృద్ధి కోసం కాకుండా ఈ ముగ్గురు తమలో తాము కలహించుకోవడం తాను చూస్తున్నానని అతను అన్నాడు. గత కొంత కాలంగా డబుల్స్‌ భాగస్వాముల విషయంలో పేస్, భూపతి, సానియా వివాదంలో భాగమయ్యారు. వీరి మధ్య విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కాయి. ఇదే విషయాన్ని బెకర్‌ గుర్తు చేశాడు. ‘టెన్నిస్‌లో భారత్‌ గతంలో మంచి ఫలితాలు సాధించింది.

అయితే ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్ల అవసరం ఉంది. వారిలో కొందరన్నా మరింత ముందుకు వెళ్లి ఫలితాలు సాధిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు కానీ మున్ముందు విజయాలు దక్కవచ్చు. దేశంలో ఆటకు మంచి ఆదరణ కూడా ఉంది. పేస్, భూపతి, సానియాలాంటి వారి అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. వారు ఆట కోసం ఏదైనా చేయాలి. వారి మధ్య గొడవలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. కానీ ముగ్గురు కలిసి పని చేయడమొక్కటే పరిష్కార మార్గం’ అని బెకర్‌ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఫెడరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను తాజా ఫామ్‌ ప్రకారం చూస్తే వచ్చే రెండేళ్లలో నొవాక్‌ జొకోవిచ్‌ అధిగమిస్తాడని బెకర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటమిని ఒప్పుకోని తత్వం ఉన్న జొకోవిచ్‌ అద్భుత రీతిలో పునరాగమనం చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కూడా అతను అన్నాడు. జొకోవిచ్‌కు 2014–16 మధ్య బెకర్‌ కోచ్‌గా వ్యవహరించగా... ఆ సమయంలో సెర్బియా స్టార్‌ ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడు.   

మరిన్ని వార్తలు