డిఫెండింగ్ చాంపియన్స్కు నిరాశ!

4 Sep, 2016 11:12 IST|Sakshi
డిఫెండింగ్ చాంపియన్స్కు నిరాశ!

న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగిన లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడికి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ పోరులో ఈ ఇండో-స్విస్ ద్వయం 6-7(1), 6-3, 11-13 తేడాతో అమెరికా జంట కోకో వాందివెగీ-రాజీవ్ రామ్ చేతిలో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. తొలి సెట్ను టై బ్రేక్లో కోల్పోయిన పేస్-హింగిస్ల జంట, రెండో సెట్ ను చేజిక్కించుకుంది.

 

అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో పేస్ జోడి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన మూడో సెట్ను చివరకు అమెరికా జంట కైవసం చేసుకోవడంతో మరోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ను సాధించాలనుకున్న పేస్-మార్టినా జోడి ఆశలు తీరలేదు.  ఈ ఓటమితో యూఎస్ ఓపెన్లో లియాండర్ పోరాటం ముగిసింది. అంతకుముందు  పురుషుల డబుల్స్ లో లియాండర్ పేస్-ఆండ్రీ బెగ్ మాన్(జర్మనీ) జంట పరాజయం చెందిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, మరో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న(భారత్)-గాబీ డాబ్రాస్కో(కెనడా) జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ జోడీ 5-7, 6-3, 10-7 తేడాతో లుకాస్ కుబాట్-అండ్రియా హ్లవకోవా జంటపై గెలిచి మూడో రౌండ్కు చేరింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా జంట 6-2, 7-6 తేడాతో గొలుబిక్ విక్టోరియా-మెలికర్ నికోలేపై గెలిచి మూడో రౌండ్ లోకి  ప్రవేశించింది.

మరిన్ని వార్తలు