సయోధ్య సాధ్యమేనా?

7 Jun, 2016 02:51 IST|Sakshi
సయోధ్య సాధ్యమేనా?

బోపన్న చేతిలో పేస్ ‘రియో’ భవితవ్యం
ఏఐటీఏకు మళ్లీ ఒలింపిక్ సెలక్షన్ తలనొప్పి

 
ఏ భారత క్రీడాకారుడూ ఇప్పటివరకు వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగలేదు. ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు మాత్రమే ఈ అవకాశముంది. అయితే లియాండర్ పేస్ ఈ అరుదైన ఘనత సాధించాలంటే మాత్రం రోహన్ బోపన్న పరోక్షంగా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి పేస్‌కు రోహన్ బోపన్న సహకరిస్తాడా? నిరాకరిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదైతేనేం మళ్లీ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులకు ‘రియో’ ఒలింపిక్స్ సెలెక్షన్ టెన్షన్ పట్టుకుంది.
 
న్యూఢిల్లీ:
వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడమే కాకుండా సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ కాంస్య పతకం కూడా సాధించిన లియాండర్ పేస్ ‘రియో’ ఆశలు డోలాయమానంలో పడ్డాయి. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకిం గ్స్‌లో భారత్‌కే చెందిన రోహన్ బోపన్న పదో స్థానానికి ఎగబాకి టాప్-10లోకి వచ్చా డు. పేస్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రియో ఒలింపిక్స్ టెన్నిస్ ఈవెంట్ అర్హత నిబంధనల ప్రకారం... టాప్-10లో ఉన్న డబుల్స్ క్రీడాకారుడు తమ దేశానికే చెందిన ఏటీపీ ర్యాంక్ ఉన్న క్రీడాకారుడితో జతగా కలిసి బరిలో దిగే అవకాశముంది.


నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ సమయంలో పేస్‌తో కలిసి ఆడేందుకు రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పేస్ టాప్-10లో ఉండటంతో భారత్‌కే చెందిన విష్ణువర్ధన్‌తో కలిసి లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి బరిలోకి దిగాడు. మహేశ్ భూపతితో కలిసి రోహన్ బోపన్న ఆడాడు. అయితే వీరందరూ లండన్ నుంచి రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు.


నాలుగేళ్లు గడిచాయి. పరిస్థితులు తారుమారయ్యాయి. 36 ఏళ్ల బోపన్న టాప్-10లోకి వచ్చాడు. మరోవైపు మరో రెండు వారాల్లో 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న పేస్ ర్యాంకేమో పడిపోయింది. మహిళల డబుల్స్‌లో 29 ఏళ్ల సానియా మీర్జా ప్రపంచ నంబర్‌వన్ స్థానంలో ఉంది.


టాప్-10లోకి తాను వస్తే ఒలింపిక్స్‌లో తన భాగస్వామి ఎవరో నిర్ణయించుకునే హక్కు తనకు ఉంటుందని రోహన్ బోపన్న స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో బోపన్న తనకు లియాండర్ పేస్‌తో కలిసి ఆడే ఉద్దేశం లేదని పరోక్షంగా తెలియజేశాడు. బోపన్న అంగీకరించకుంటే మాత్రం పేస్ ‘రియో’ ఆశలు ఆవిరైనట్టే.


బోపన్న, పేస్ కాకుండా భారత్ నుంచి డబుల్స్ ర్యాంకింగ్స్‌లో పురవ్ రాజా (103), దివిజ్ శరణ్ (114), సాకేత్ మైనేని (125), జీవన్ నెదున్‌చెజియాన్ (134), మహేశ్ భూపతి (164) టాప్-200లో ఉన్నారు. ఒలింపిక్స్‌లో ఆడాలంటే ఆయా ఆటగాళ్లు గత నాలుగేళ్లలో కనీసం మూడుసార్లు డేవిస్ కప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న నిబంధన  ఒకటుంది. దీనిని కచ్చితంగా పాటిస్తే మాత్రం పురవ్, దివిజ్, జీవన్, భూపతిలకు రియో అవకాశాల్లేవు. కేవలం సాకేత్ మాత్రమే ఈ నిబంధనకు లోబడి ఉన్నాడు. అయితే జాతీయ టెన్నిస్ సమాఖ్య అభ్యర్థిస్తే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డేవిస్ కప్ నిబంధనను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు.


రంగంలోకి ఏఐటీఏ...
ఒలింపిక్స్‌కు అర్హత కోసం ర్యాంకింగ్ తుది గడువు పూర్తి కావడంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) అధికారులు రంగంలోకి దిగారు. లండన్ ఒలింపిక్స్ సమయంలో జరిగిన రచ్చ ఈసారి కాకుండా సాఫీగా సెలెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈనెల 11న సమావేశం కానున్నారు. బోపన్న, పేస్, సానియా మీర్జాలతో కూడా చర్చించాలని భావిస్తున్నారు. పేస్‌తో కలిసి ఒలింపిక్స్‌లో ఆడాలని రోహన్ బోపన్నను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ‘డబుల్స్‌లో భారత్ తరపున నంబర్‌వన్, రెండో ర్యాంక్ ఉన్న ఆటగాళ్లు జతగా ఆడటం సముచితంగా ఉంటుంది. పేస్, బోపన్న ఇద్దరూ అనుభవజ్ఞులే.

బోపన్నకు తన భాగస్వామిని ఎంచుకునే అర్హత ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి భేషజాలకు పోకుండా బోపన్న వివేకంగా వ్యవహరిస్తే సమస్యే ఉత్పన్నం కాదు. ప్రస్తుతం పేస్ ర్యాంక్ పడిపోయిన విషయం వాస్తవమే. అయితే పేస్ సాధించిన ఘనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఏఐటీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే రోహన్ బోపన్న ఏఐటీఏ అధికారుల ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తాడా లేక లండన్ ఒలింపిక్స్ సమయంలో వ్యవహరించినట్టు మొండిగా ఉంటాడా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.
 
మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా-బోపన్నలకు అవకాశం

 
మిక్స్‌డ్ డబుల్స్ విషయానికొస్తే... ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల కంబైన్డ్ ర్యాంకింగ్ ఆధారంగా ఎంట్రీ లభిస్తుంది. 16 జోడీలు మాత్రమే మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొనే వీలుంది. మహిళల డబుల్స్‌లో సానియా నెంబర్‌వన్ ర్యాంక్, పురుషుల డబుల్స్‌లో బోపన్న పదో ర్యాంక్ కలిపితే వీరిద్దరి కంబైన్డ్ ర్యాంక్ 11 అవుతుంది. కాబట్టి భారత్ నుంచి రోహన్ బోపన్న, సానియా మీర్జాలకు మాత్రమే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడే అవకాశముంది. దాంతో మిక్స్‌డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్‌కు బరిలో దిగే చాన్స్ లేదు. సానియాకు కూడా బోపన్నతో కలిసే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడాలని కోరిక ఉంది.

మరిన్ని వార్తలు