‘కోహ్లి నేర్చుకున్నాడు.. మీరు నేర్చుకోండి’

21 Aug, 2018 14:31 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ క్రికెటర్లు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని చూసి నేర్చుకోవాలంటున్నాడు ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ పాల్‌ ఫార్‌బ్రేస్. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్  ఆలౌట్‌ కావడంతో వారిలో స్ఫూర్తిని నింపేందుకు యత్నిస్తున్నాడు ఫార్‌బ్రేస్‌.

పాల్‌ మాట్లాడుతూ...'ఆటగాళ్లు ఇతర ఆటగాళ్లను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారని నేను బలంగా నమ్ముతా. బంతి వచ్చినప్పుడు కోహ్లి ఎలా స్పందిస్తున్నాడు, ఎలా ఎదుర్కొంటున్నాడనేది మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గొప్ప ఆటగాళ్ల నుంచి చూసి చాలా నేర్చుకోవచ్చు. వారి ఆటను గమనించి అలా ఆడేలా ప్రయత్నించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇంగ్లండ్‌ టాపార్డర్‌ ఆటగాళ్లు కోహ్లిని చూసి నేర్చుకోమని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే అతడు ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్‌. ఈ సిరీస్‌లో అతడి ఆటతీరు అద్భుతం. ఇలా ఆడే ఆటగాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి చాలా నేర్చుకున్నాడు' అని పాల్‌ అన్నాడు.

'ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో సుమారు 15 క్యాచ్‌లు వదిలేశాం. ఫీల్డింగ్‌ మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇందు కోసం మా ఫీల్డింగ్‌ కోచ్‌ ఎంతో శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్‌లో రెండు రోజులు పూర్తిగా ఫీల్డింగ్‌కు కేటాయించాం. అయినప్పటికీ మూడో టెస్టులో మా ఫీల్డింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు' అని అసంతృప్తి వ్యక్తం చేశాడు పాల్‌.

మరిన్ని వార్తలు