ధోనిని చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి

30 Apr, 2018 03:54 IST|Sakshi
మహేంద్ర సింగ్‌ ధోని

సునీల్‌ గావస్కర్‌

పటిష్టమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. గత సీజన్‌లలో ముంబై ఆరంభంలో తడబడి ఆ తర్వాత కోలుకొని చాంపియన్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆకట్టుకుంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన అతను జట్టును విజయబాట పట్టించాడు. లీగ్‌ తొలి మ్యాచ్‌లోనే ముంబైను ఓడించి... ఇపుడు అదే జట్టు చేతిలో ఓటమి పాలైన చెన్నై నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఉంది.

కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో ఢిల్లీ జట్టు పరాజయాల బాటను విడిచి విజయపథంలోకి వచ్చింది. మరోవైపు ఇద్దరు యువ బౌలర్లు అవేశ్‌ ఖాన్, శివమ్‌ మావి దుందుడుకు ప్రవర్తనకుగాను ఐపీఎల్‌ కౌన్సిల్‌ మందలించడం శుభపరిణామం. బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేశాక ఈ ఇద్దరు బౌలర్లు అభ్యంతరకర భాషను ప్రయోగించడం మంచిది కాదు. యువ క్రికెటర్లలో ఈ దూషణ పర్వం అలవాటును మొగ్గలోనే తుంచేయాలి. అయితే టీవీల్లో తమ సీనియర్‌ క్రికెటర్ల ప్రవర్తనను చూశాకే వీరు కూడా ఇలా చేసి ఉంటారనిపిస్తోంది.

ఈ మందలింపు అనేది ఈ ఇద్దరితోపాటు మిగతా యువ ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదే. వికెట్‌ తీసినపుడుగానీ, అర్ధ సెంచరీ చేసినపుడగానీ ఆవేశంతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఆవేశం ప్రదర్శించే బదులు హాయిగా నవ్వుతూ ఆ క్షణాలను ఆస్వాదిస్తే అందరికీ బాగుంటుంది. మైదానంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో యువ క్రికెటర్లు ధోనిని చూసి నేర్చుకోవాలి. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించినా ధోని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. విజయంలోనూ అతను హుందాతనం చూపిస్తాడు.


>
మరిన్ని వార్తలు