మా ప్రధాన ఆయుధం అతనే : కోహ్లి

5 Jul, 2018 11:21 IST|Sakshi

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో తమ చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించడం ఖాయమని అంటున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఏ పిచ్‌పై అయినా సమర్ధవంతంగా బౌలింగ్‌ చేసే కుల్దీప్‌ యాదవ్‌.. ఇంగ్లండ్‌ పర్యటనలో తమ ప్రధాన ఆయుధంగా కోహ్లి అభివర్ణించాడు. ‘ఏ పిచ్‌పై ఆడినా కుల్దీప్ యాదవ్ సమర్థవంతంగా బౌలింగ్ చేస్తాడు. ఇక పిచ్‌ నుంచి కొంచెం టర్న్ లభిస్తే అతడి బౌలింగ్‌ మరింత పదునెక్కుతుంది. ఆ సమయంలో కుల్దీప్‌ బంతుల్ని బ్యాట్స్‌మెన్ ఎదుర్కోవడం చాలా కష్టం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆలోచనల్ని అతను సులువుగా చదవగలడు. ఈ పర్యటనలో అతనే మా ప్రధాన ఆయుధం. తొలి టీ20లోనే బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌ విభాగాల్లో జట్టు రాణించడం సంతోషంగా ఉంది. ప్రధానంగా యువ ఆటగాళ్లు జట్టు బాధ్యతలు పంచుకోవడంతో ఆ ఆనందాన్నిరెట్టింపు చేసింది’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.

మంగళవారం అర్ధరాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (101 నాటౌట్) శతకం బాదడంతో భారత్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/24) ధాటికి విలవిలలాడిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమవగా.. లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలోనే ఛేదించి అలవోకగా విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ యాదవ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు