మాపై అంచనాల్లేవంటూ కివీస్‌ మైండ్‌గేమ్‌!

8 Jul, 2019 08:27 IST|Sakshi

ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో మరో ఆసక్తికర, ఉత్కంఠ భరిత పోరుకు రంగం సిద్ధమవుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టును రేపు (మంగళవారం) మాంచెస్టర్‌లో ఢీకొనబోతోంది. ఈ నాకౌట్‌ మ్యాచ్‌లో కివీస్‌ను మట్టికరిపించి.. విశ్వవిజేతను నిర్ణయించే ఫైనల్‌ పోరుకు అర్హత సాధించాలని కోహ్లి సేన భావిస్తోంది. అటు వరుస పరాజయాలతో ఒకింత చతికిలపడి.. బతుకు జీవుడా అన్న తరహాలో నాకౌట్‌కు చేరిన కివీస్‌ జట్టు కూడా సెమీఫైనల్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఇంగ్లండ్‌తో ఒక పరాజయం మినహా భారత్‌ ఎదురులేని ఆటతీరుతో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో భారత్‌ హాట్‌ ఫెవరేట్‌గా సెమీఫైనల్‌కు సిద్ధమవుతుండగా.. అండర్‌ డాగ్‌గా కివీస్‌ జట్టు పోటీకి సై అంటోంది. ఈ నేపథ్యంలో తమ జట్టు మీద అంచనాలు లేకపోవడం తమకు కలిసివస్తుందంటూ ఆ జట్టు మైండ్‌ గేమ్‌కు తెరతీసింది.

అసలు న్యూజిలాండ్‌ జట్టు మీద ఎలాంటి అంచనాలు లేవని, కాబట్టి తమ మీద ఎలాంటి ఒత్తిడి ఉండబోదని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ చెప్పుకొచ్చారు. భారీ అంచనాలతో భారత్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది కాబట్టి.. ఆ జట్టు మీదనే ఒత్తిడి ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. ‘నిజానికి నాకౌట్‌లో సెకండ్‌ చాన్స్‌ అనేది ఉండదు. ఇక, మా దృష్టిలో ప్రజలు మేం గెలుస్తామని అనుకోవడం లేదు. నిజానికి అది మా జట్టుకు మేలు చేసేదే.. మేం పూర్తిస్థాయి సామర్థ్యంతో ఆశావాదంతో స్వేచ్ఛగా ఆడతాం. ఇక, న్యూజిలాండ్‌ కన్నా భారత్‌ మీద అంచనాల భారం ఎక్కువగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రజలు ఏమీ ఆలోచిస్తున్నారన్నది తాము పెద్దగా పట్టించుకోవడం లేదని, తుదిపోరులో నిలవడంపైనే దృష్టి పెట్టామని అన్నారు. టీమిండియా నాణ్యమైన జట్టు అని, ఆ జట్టు లైనప్‌ నిండా మ్యాచ్‌ విన్నర్స్‌ ఉన్నారని, తమ ఉత్తమోత్తమ ప్రదర్శన ఇవ్వడం ద్వారానే ఆ జట్టును ఓడించగలమని గ్యారీ స్టీడ్‌ వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్న బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ తిరిగి జట్టులోకి రావడం కివీస్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అండర్‌డాగ్‌గానే సెమీస్‌ పోరులోకి అడుగుపెట్టడం మంచిదేనని, ఎలాంటి ఒత్తిడి లేకుండా శాంతియుతంగా మ్యాచ్‌కు సిద్ధమవుతామని అతను చెప్పుకొచ్చాడు.

రాజసంగా భారత్‌ సెమీస్‌ ఎంట్రీ..
టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన భారత్‌ ప్రస్థానం సెమీఫైనల్‌ వరకు రాజసంగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం... వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దు కావడం మినహా... మిగతా ఏడు మ్యాచ్‌ల్లో భారత్‌ అదరగొట్టింది. శిఖర్‌ ధావన్, విజయ్‌ శంకర్‌ గాయాలతో మధ్యలోనే వైదొలిగినా వారి నిష్క్రమణ ప్రభావం టీమిండియా ప్రదర్శనపై అంతగా పడలేదు. రోహిత్‌ శర్మ ఐదు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉండటం పెద్ద ఊరట. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ శతకంతో ఫామ్‌లోకి రావడం... కెప్టెన్‌ కోహ్లి నిలకడ... వెరసి భారత టాపార్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది.అయితే ఇప్పటి వరకు భారత మిడిలార్డర్‌కు సరైన పరీక్ష ఎదురుకాలేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో టాపార్డర్‌ ప్రదర్శన కీలకం కానుంది. భారత్‌ భారీ స్కోరు చేయాలన్నా... లక్ష్య ఛేదన సాఫీగా సాగాలన్నా రోహిత్, రాహుల్, కోహ్లిలో ఒకరు మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిందే. ఒకవేళ వీరు విఫలమైతే మిడిలార్డర్‌లో రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ పాండ్యా, ధోని బాధ్యతాయుతంగా ఆడాలి. బౌలింగ్‌ విషయానికొస్తే జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. బుమ్రా 17 వికెట్లు, షమీ 14 వికెట్లు తీశారు. లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ 11 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్‌ యాదవ్‌ కూడా తమవంతుగా రాణిస్తున్నారు.  

ఒకరిద్దరిపైనే భారం..
అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో ఉన్న న్యూజిలాండ్‌కు ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేసే అలవాటు ఉంది. 1975, 1979, 1992, 1999, 2007, 2011 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్లో నిష్క్రమించిన కివీస్‌... 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరి తుదిమెట్టుపై చతికిలపడింది. ఈ ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌ ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు పరాజయం ఎదురుకాలేదు. అయితే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌ జట్టుకు ఓటమి ఎదురైంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ బ్యాటింగ్, బౌలింగ విభాగాల్లో ఎక్కువగా ఒకరిద్దరి ప్రదర్శనపైనే ఆధారపడుతోంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, రాస్‌ టేలర్‌... బౌలింగ్‌లో ఫెర్గూసన్, ట్రెంట్‌ బౌల్ట్‌ నిలకడగా ఆడుతున్నారు. విలియమ్సన్, టేలర్‌ తక్కువ స్కోర్లకే ఔటైతే మాత్రం న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశ తప్పదేమో. 

మరిన్ని వార్తలు