హామిల్టన్‌కే టైటిల్‌

8 Oct, 2017 23:50 IST|Sakshi

సుజుకా: జపాన్‌ గ్రాండ్‌ ప్రి రేసులో బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ హవా కొనసాగింది. ‘పోల్‌’ పొజిషన్‌తో ప్రధాన రేసును ఆరంభించిన అతను విజేతగా నిలిచాడు. జపాన్‌లో హామిల్టన్‌కు ఇది నాలుగో టైటిల్‌. ఓవరాల్‌గా కెరీర్‌లో 61వ టైటిల్‌ కావడం విశేషం. ఆదివారం సుజుకా ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌పై ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ దూసుకెళ్లాడు. అందరికంటే వేగంగా హామిల్టన్‌ 53 ల్యాపులను 1 గంటా 27ని.31.194 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ సీజన్‌లో అతనికిది ఎనిమిదో టైటిల్‌ కాగా డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్‌ (306)... వెటెల్‌ (247) కంటే 59 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. ఆదివారం జరిగిన రేసులో వెటెల్‌ ఆరంభంలోనే తప్పుకున్నాడు. ఇంజిన్‌ మొరాయించడంతో అతను నాలుగో ల్యాపులోనే వెనుదిరగాల్సి వచ్చింది.

దీంతో రెడ్‌బుల్‌ డ్రైవర్లు మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్, డానియెల్‌ రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్‌ చేశారు. ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు ఈస్టెబన్‌ ఒకాన్‌ ఆరు... పెరెజ్‌ ఏడో స్థానం పొందారు. ‘రేసు చివర్లో మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ వణికించాడు. అసాధారణ వేగంతో అతడు నన్ను చేరుకున్నాడు.  ఏదేమైనా మొత్తానికి గెలిచి ఊపిరి పీల్చుకున్నాను. ఈ సీజన్‌లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇంకా చాలా రేసులు మిగిలున్నాయి’ అని హామిల్టన్‌ అన్నాడు. ఈ సీజన్‌లో తదుపరి యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రాండ్‌ ప్రి రేసు ఈ నెల 22న ఆస్టిన్‌లో జరుగుతుంది.   

మరిన్ని వార్తలు