హామిల్టన్‌ 2020 

20 Jul, 2018 02:45 IST|Sakshi

మెర్సిడెజ్‌తో రెండేళ్లు కాంట్రాక్టు పొడిగింపు 

ఏడాదికి రూ. 359 కోట్ల డీల్‌ 

లండన్‌: ఫార్ములావన్‌ చాంపియన్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో రెండేళ్లు మెర్సిడెజ్‌ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇరు వర్గాల మధ్య ఏడాదికి రూ. 359 కోట్ల భారీ డీల్‌ కుదిరినట్లు సమాచారం. దీంతో అత్యధిక మొత్తం తీసుకునే ఎఫ్‌1 డ్రైవర్‌గా అతను రికార్డుల్లోకెక్కనున్నాడు. మొత్తానికి బ్రిటీష్‌ డ్రైవర్‌ 2020 ఏడాది వరకు ఈ కాంట్రాక్టు పొడిగించుకున్నాడు. ఇటీవల జట్టు మారనున్నాడనే ఊహాగానాలకు కొత్త డీల్‌తో తెరదించాడు హామిల్టన్‌. ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ది మెర్సిడెజ్‌తో విజయవంతమైన భాగస్వామ్యం.
 

ఎఫ్‌1 దిగ్గజం షుమాకర్‌ తర్వాత అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న హామిల్టన్‌ అత్యధిక పోల్‌ పొజిషన్స్‌ (76) సాధించిన డ్రైవర్‌గా ఘనత వహించాడు. 33 ఏళ్ల ఈ స్టార్‌ రేసర్‌ నాలుగుసార్లు ఫార్ములావన్‌ చాంపియన్‌షిప్‌ సాధించాడు. ‘ మెర్సిడెజ్‌ కుటుంబంతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పుడది మళ్లీ బలపడింది. మరో రెండేళ్లు కాంట్రాక్టు పొడిగించుకోవడం ఆనందంగా ఉంది’ అని తెలిపిన హామిల్టన్‌ కొత్త డీల్‌పై సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తమ సంస్థతో కొనసాగనుండటం పట్ల మెర్సిడెజ్‌ చీఫ్‌ టొటొ వోల్ఫ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న ఫెరారీ డ్రైవర్‌ వెటెల్‌ (171) కంటే హామిల్టన్‌ (163) 8 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నాడు.   

మరిన్ని వార్తలు