వారెవ్వా... హామిల్టన్‌

23 Jul, 2018 03:52 IST|Sakshi
లూయిస్‌ హామిల్టన్‌

జర్మనీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం

14వ స్థానం నుంచి రేసు మొదలుపెట్టి విజేతగా నిలిచిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌

హాకెన్‌హీమ్‌ (జర్మనీ): క్వాలిఫయింగ్‌ సెషన్‌లో నిరాశపరిచినప్పటికీ ప్రధాన రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ అద్భుతం చేశాడు. 14వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఏకంగా విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో హామిల్టన్‌ 67 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 29.845 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది నాలుగో విజయం. మెర్సిడెస్‌ జట్టుకే చెందిన బొటాస్‌ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్‌ కిమీ రైకోనెన్‌కు మూడో స్థానం లభించింది.

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఫెరారీ జట్టు మరో డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ 51వ ల్యాప్‌లో వైదొలిగాడు. కారుపై నియంత్రణ కోల్పోయిన వెటెల్‌ ట్రాక్‌ గోడను ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు పెరెజ్‌ ఏడో స్థానంలో, ఒకాన్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు.  రేసు ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 53వ ల్యాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పై దూసుకొచ్చినందుకు విచారణకు హాజరు కావాలని హామిల్టన్‌కు స్టీవార్డ్స్‌ నోటీసులు జారీ చేశారు. అయితే హామిల్టన్‌ ఉద్దేశపూర్వకంగా తాను అలా చేయలేదని ఇచ్చిన వివరణపట్ల సంతృప్తి చెందిన స్టీవార్డ్స్‌ అతడిని హెచ్చరికతో వదిలిపెట్టారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోయుంటే హామిల్టన్‌ టైటిల్‌ కోల్పోయేవాడు.

మరిన్ని వార్తలు