హామిల్టన్‌కు పోల్‌

16 Sep, 2018 04:37 IST|Sakshi

నేడు సింగపూర్‌ గ్రాండ్‌ ప్రి రేసు

సింగపూర్‌: ఈ సీజన్‌లో ఏడో విజయంపై మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ దృష్టి పెట్టాడు. శనివారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ దుమ్ము రేపాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ముగించి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటికే ఆరు రేసుల్లో గెలిచిన హామిల్టన్‌ క్వాలిఫయింగ్‌ చివరి సెషన్‌లో ల్యాప్‌ను ఒక నిమిషం 36.015 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్‌ వరుసగా 7, 9 స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. సీజన్‌లో 14 రేసులు పూర్తయ్యాక ప్రస్తుతం హామిల్టన్‌ 256 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉండగా... 226 పాయింట్లతో వెటెల్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

సాయంత్రం గం. 5.35 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు