హామిల్టన్‌ను గెలిపించిన ఫెరారీ

30 Sep, 2019 03:00 IST|Sakshi

సీజన్‌లో తొమ్మిదో విజయం

ఫార్ములా వన్‌ సోచి గ్రాండ్‌ప్రి

సోచి: గెలవాల్సిన రేసును బంగారు పళ్లెంలో పెట్టి మెర్సిడెస్‌కు అప్పగించింది ఫెరారీ. ప్రత్యర్థి పేలవ రేసు వ్యూహాన్ని అనుకూలంగా మార్చుకున్న మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయీస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఆరోసారి ప్రపంచ డ్రైవర్‌ చాంపియన్‌గా అవతరించడానికి మరింత దగ్గరయ్యాడు. ఆదివారం 53 ల్యాప్‌ల ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన అతను అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 38.992 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మరో మెర్సిడెస్‌ డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ 3.829 సెకన్ల వెనుకగా రేసును ముగించి రెండో స్థానంలో నిలువగా... పోల్‌ పొజిషన్‌ నుంచి రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

సెబాస్టియన్‌ వెటెల్‌ (ఫెరారీ) ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రేసు మధ్యలోనే వైదొలిగాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్లు వెర్‌స్టాపెన్, ఆల్బన్‌ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అందరి కంటే చివరగా... పిట్‌లేన్‌ నుంచి రేసును ఆరంభించిన ఆల్బన్‌ అద్భుతమైన డ్రైవింగ్‌తో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం డ్రైవర్‌ ఛాంపియన్ షిప్ లో హామిల్టన్‌ 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 73 పాయింట్ల తేడాతో బొటాస్‌ రెండో స్థానంలో ఉన్నాడు.  తదుపరి గ్రాండ్‌ప్రి అక్టోబర్‌ 13న జపాన్‌లో జరుగుతుంది.

మరిన్ని వార్తలు