సైనిక దుస్తుల్లో ధోని బ్యాటింగ్‌; విజిల్‌ పోడు..!

17 Aug, 2019 19:45 IST|Sakshi

శ్రీనగర్‌ : పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు వెళ్లిన లెఫ్టినెంట్‌ కల్నల్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మళ్లీ బ్యాటు పట్టాడు. భారత సైన్యంలో 106 టీఏ పారామిలటరీ బెటాలియన్‌తో కలిసి 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ధోని లేహ్‌లో సరదాగా కాసేపు క్రికెట్‌ ఆడాడు. బాస్కెట్‌ బాల్‌ గ్రౌండ్‌లో ధోని క్రికెట్‌ ఆడుతున్న ఫొటోను చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.  ‘విభిన్న క్రీడా మైదానాల్లో.. విభిన్నమైన గేమ్‌ ప్లాన్లు’.. ‘#విజిల్‌ పోడు’ అని పేర్కొంది. సైనిక దుస్తుల్లో బ్యాటింగ్‌ చేస్తున్న ధోని ఫొటో వైరల్‌ అయింది. 

ఆగస్టు 15న లేహ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధోని సియాచిన్‌ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాడు. అనంతరం సియాచిన్‌ సైనిక పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో కాసేపు క్రికెట్‌ ఆడాడు. ఇక జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో ధోని అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. ఆగస్టు15 వ తేదీతో ధోని కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందుకు శనివారం తిరుగు ప్రయాణం అయ్యాడు.
(చదవండి : ధోని తిరుగు ప్రయాణం..)

కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్‌ ఫోర్స్‌లో ధోని పనిచేశాడు.  ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. ప్రపంచకప్‌ సమయంలో కూడా సైనికుల త్యాగానికి చిహ్నమైన ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ను కీపింగ్‌ గ్లౌవ్స్‌పై ధరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు