ఐపీఎల్‌ కన్నా ప్రాణం మిన్న

4 Apr, 2020 03:34 IST|Sakshi

భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు మించిన ప్రాధాన్యత గల అంశమేదీ లేదని భారత వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ఐపీఎల్‌ కచ్చితంగా మరింత కాలం వాయిదా వేయాల్సిందేనని సూచించాడు. ఇప్పుడప్పుడే ఈ లీగ్‌ను నిర్వహించే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్‌ కన్నా అందరూ ప్రాణాలతో మిగిలుండటమే ఇప్పుడు ముఖ్యం. లాక్‌డౌన్‌ కాలం లో ప్రతీ ఒక్కరూ  ప్రభుత్వం మాట వినాల్సిందే. లేదంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతా చక్కబడ్డాక మళ్లీ ఐపీఎల్‌ ఆడు కోవచ్చు. కరోనాతో ఎందరో ప్రాణాలు వదులుతున్నారు. వారిని కాపాడుకునేందుకు మన వంతు ప్రయత్నం చేయాలి’ అని రైనా పేర్కొన్నాడు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రైనా ఇప్ప టికే రూ. 52 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. నిర్బంధ కాలంలో పూర్తిగా కుటుంబంతో గడుపుతోన్న రైనా... ఒక క్రికెటర్‌కు ఎంతో ముఖ్యమైన క్రికెట్‌ను దాటి మరో జీవితం ఉంటుందని చెప్పాడు. ‘గతవారమే నా భార్య బాబుకి జన్మనిచ్చింది. ఈ సమయంలో ఇంటి పనులు, వంట పనులతోపాటు వారి అవసరాల్ని దగ్గర ఉండి చూసుకోవడం చాలా సంతృప్తినిస్తోంది. క్రికెట్‌కు మించిన మరో అందమైన జీవితం ఉందని ఇలాంటి పరిస్థితుల్లోనే అవగతమవుతుంది’ అని శుక్రవారం తన ఐదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా రైనా అన్నాడు.

మరిన్ని వార్తలు