మెస్సీ ఎట్‌ 700

2 Jul, 2020 09:05 IST|Sakshi

కెరీర్‌లో 700 గోల్స్‌ సాధించిన అర్జెంటీనా స్టార్‌

∙ఈ ఘనత వహించిన ఏడో ప్లేయర్‌గా గుర్తింపు

బార్సిలోనా: కరోనా మహమ్మారితో ఆటకు విరామం లభించినా తనలో జోరు ఏమాత్రం తగ్గలేదని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్, బార్సిలోనా క్లబ్‌ స్టార్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ చాటిచెప్పాడు. స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ లా లీగాలో బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 33 ఏళ్ల మెస్సీ కెరీర్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఫుట్‌బాల్‌ కెరీర్‌లో 700 గోల్స్‌ పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్‌గా ఈ అర్జెంటీనా ప్లేయర్‌ గుర్తింపు పొందాడు. అట్లెటికో మాడ్రిడ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా 50వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను మెస్సీ గోల్‌ పోస్ట్‌లోనికి పంపించి కెరీర్‌లో 700వ గోల్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా మెస్సీ 2004 నుంచి బార్సిలోనా జట్టుకు ఆడుతున్నాడు.  

స్పెయిన్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చడంతో లా లీగాను మార్చి 12న నిరవధికంగా వాయిదా వేశారు. అప్పటికి లీగ్‌లో 11 రౌండ్‌ మ్యాచ్‌లు ఇంకా జరగాల్సి ఉన్నాయి. కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక జూన్‌ 12న లా లీగా పునఃప్రారంభమైంది. 20 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ఇప్పటివరకు 32 రౌండ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. మరో ఆరు రౌండ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉన్న ఈ లీగ్‌ జూలై 19న ముగుస్తుంది. ప్రస్తుతం రియల్‌ మాడ్రిడ్‌ 71 పాయింట్లతో తొలి స్థానంలో, డిఫెండింగ్‌ చాంపియన్‌ బార్సిలోనా 70 పాయింట్లతో రెండో స్థానంలో, 59 పాయింట్లతో అట్లెటికో మాడ్రిడ్‌ మూడో స్థానంలో, 57 పాయింట్లతో సెవిల్లా నాలుగో స్థానంలో ఉన్నాయి. టాప్‌–4లో నిలిచిన జట్లు చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధిస్తాయి.   

మరిన్ని వార్తలు