దీదీకి స్పెషల్‌ గిప్ట్‌ పంపిన మెస్సీ

5 Oct, 2018 11:16 IST|Sakshi
మమతా బెనర్జీకి ప్రత్యేక బహుమానంగా జెర్సీని పంపించిన లియెనాల్‌ మెస్సీ

కోల్‌కతా : లెజండరి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియెనాల్‌ మెస్సీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అర్జెంటీనా ఆటగాడికి మన దేశంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇంతటి క్రేజ్‌ ఉన్న ఈ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒక ప్రత్యేక బహుమతిని పంపారు. మెస్సీ, ‘దీదీ నం 10’ అనే జెర్సీని మమతా బెనర్జీకి స్పెషల్‌ గిఫ్ట్‌గా పంపించారు. దాంతో పాటు ‘నా స్నేహితురాలికి శుభాకాంక్షలు మీ మెస్సీ’ అనే సందేశాన్ని జెర్సీ మీద​ ప్రింట్‌ చేయించారు.

ఇంతకు దీదీకి ఈ ప్రత్యేక బహుమానం పంపాడానికి కారణం ఏంటంటే గతేడాది ఫిఫా యూ - 17(ఫిఫా అండర్‌ సెవంటీన్‌ వరల్డ్‌ కప్‌)ని భారతదేశంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని మొత్తం 6 స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఫైనల్‌ మ్యాచ్‌ కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు దీదీని అభినందిస్తూ.. మెస్సీ ఈ జెర్సీని ప్రత్యేక బహుమతిగా అందజేశారు. గతంలో డియాగో మారడోనా, రొమారియో, రోనాల్డో వంటి దిగ్గజ క్రీడాకారులు ధరించిన ఈ జెర్సీని మెస్సీ, దీదీ గౌరవార్థం ఆమెకి బహుకరించారు.

బార్సిలోనా లెజెండ్స్ ద్వారా మెస్సీ ఈ జెర్సీని నెక్స్ట్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులకు అందజేశారు. ఈ విషయం గురించి ఫౌండేషన్‌ స్థాపకుడు కౌషిక్‌ మౌలిక్‌ ‘ఈ జెర్సీని వారు దీదీకి స్వయంగా అప్పగించడానికి కుదరక పోవడంతో మాకు అందచేశారు. దీన్ని సీఎమ్‌కు అందిచడం మా బాధ్యత. ఇందుకు గాను మేము సీఎమ్‌వోను కలవాల్సి ఉంది. ముఖ్యమంత్రి మాకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన రోజున మేము ఆమెని కలిసి ఈ జెర్సీని అందజేస్తాం’ అని తెలిపారు. లియోనాల్‌ మెస్పి 2011లో అర్జెంటీనా, వెనిజులాల మధ్య జరిగిన ఫ్రేండ్లీ మ్యాచ్‌ కోసం తొలిసారి కోల్‌కతా సాల్ట్‌ లేక్‌ స్టేడియానికి వచ్చారు.

మరిన్ని వార్తలు