మెస్సీ కుటుంబంపై చిలీ అభిమానుల దాడి

29 Dec, 2015 13:14 IST|Sakshi
మెస్సీ కుటుంబంపై చిలీ అభిమానుల దాడి

శాండియాగో: అభిమానం అదుపుతప్పింది. క్రీడాస్ఫూర్తి మంటకలిసింది. ఇరు జట్ల అభిమానులు పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆటగాళ్లకు చెందిన కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు. ఇదీ.. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా శాండియాగోలోని ఎస్టాడియో నేషనల్ స్టేడియంలో చోటుచేసుకున్న పరిస్థితి.

మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరుజట్లూ అద్భుతంగా ఆడటంతో ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు. చివరికి షూట్ అవుట్ ద్వారా ఆతిథ్య చిలీ జట్టు 4-1 తేడాతో విజేతగా నిలిచిందిది. కాగా,  ఫస్ట్హాఫ్ విరామంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ కుటుంబసభ్యులను ఉద్దేశించి కొందరు చిలీ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోపోద్రిక్తుడైన మెస్సీ సోదరుడు రొడ్రిగో ఘాటుగా ప్రతిస్పందించాడు. దీంతో ఇరు బృందాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఒక దశలో మెస్సీ కుటుంబసభ్యులను చిలీ అభిమానులు తోసివేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు మెస్సీ సోదరుణ్ని టీవీ క్యాబిన్కు తరలించారు. మిగతా మ్యాచ్ ను అక్కడినుంచే వీక్షించాలని, గ్యాలరీలోకి వెళ్లొద్దని రొడ్రిగోను పోలీసులు అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిసింది.

మరిన్ని వార్తలు