రేసులో మిగిలింది వీరే.. చీఫ్‌ సెలక్టర్‌ ఎవరో?

18 Feb, 2020 11:11 IST|Sakshi

ముంబై: మార్చి మొదటి వారంలో టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ వచ్చే అవకాశం ఉందని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్‌ ఖోడాల పదవీ కాలం ముగియడంతో కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీకి బీసీసీఐ అప్పగించింది. కొత్త సెలక్టర్లను ఎప్పుడు ప్రకటించాలన్న విషయంలో నిర్దిష్ట సమయం ఏదీ లేదన్న మదన్ లాల్.. మార్చి 1, 2 నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల స్థానం కోసం పోటీపడుతున్న వారిలో చివరి దశ ఇంటర్వ్యూలకు మొత్తం నలుగురు మిగిలారు. వీరిలో మాజీ లెగ్‌స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్, మరో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్‌లు ఉన్నారు. 

అయితే, చీఫ్ సెలక్టర్ పోస్టు కోసం అజిత్‌ అగార్కర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ల మధ్య పోటీ ఉండవచ్చు. అత్యంత అనుభవజ్ఞుడినే చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తామన్న బీసీసీఐ చీఫ్ గంగూలీ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవర్ని చీఫ్‌ సెలక్టర్‌గా చేస్తారో వేచిక చూడక తప్పదు. టెస్టుల పరంగా వెంకటేశ్‌ ప్రసాద్‌ ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే, వన్డేలు పరంగా అజిత్‌ అగార్కర్‌ ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. వెంకటేశ్‌ ప్రసాద్‌కు 33 టెస్టులు ఆడిన అనుభవం ఉంటే, అగార్కర్‌కు 26 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. వన్డేల్లో వెంకటేశ్‌ ప్రసాద్‌ 161 మ్యాచ్‌లు ఆడితే, అగార్కర్‌ 191 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. నాలుగు అంతర్జాతీయ టీ20లు కూడా అగార్కర్‌ ఆడాడు. దీన్ని బట్టి చూస్తే చీఫ్‌ సెలక్టర్‌గా అగార్కర్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం వెంకటేశ్‌ ప్రసాద్‌కు చాన్స్‌ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. (ఇక్కడ చదవండి: ఆడకుండా.. నన్ను కిడ్నాప్‌ చేశారు: అశ్విన్‌)

మరిన్ని వార్తలు