ఈ సిరీసూ గెలిస్తే సరి

12 Jan, 2019 01:57 IST|Sakshi

ఆస్ట్రేలియాతో తొలి వన్డే నేడు

ఆత్మవిశ్వాసంతో టీమిండియా

కొత్త కూర్పుతో ఆస్ట్రేలియా 

ఇది వన్డే ప్రపంచ కప్‌ సంవత్సరం... అందుకే ఏ టోర్నీ బరిలో దిగినా, ఏ సిరీస్‌ ఆడినా జట్ల లెక్కలన్నీ కప్పు చుట్టూనే తిరుగుతున్నాయి. అంతటి ప్రతిష్టాత్మక విశ్వ సమరానికి ముందు బలగాలను సరిచూసుకునేందుకు, సంసిద్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ కోణంలో టీమిండియాకు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ రూపంలో చక్కటి అవకాశం దక్కింది. సమస్యలను చక్కదిద్దుకుని, కూర్పును మరింత పటిష్ఠం చేసుకునే వీలు చిక్కింది. అసలే బలహీనంగా ఉన్న ఆతిథ్య జట్టు... ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బరిలో దిగుతోంది. మరి, కోహ్లి సేన ఊపును కొనసాగిస్తుందా? ఫించ్‌ బృందం ఎంతవరకు పోటీనిస్తుంది? అనేది చూడాలి.   

సిడ్నీ: దశాబ్దాల కల అయిన టెస్టు సిరీస్‌ గెలుపును సాకారం చేసుకుని అమితోత్సాహంతో ఉన్న టీమిండియా... వన్డే సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా సంగతి తేల్చేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ తొలి వన్డే జరుగనుంది. బలాబలాలు, ఆటగాళ్ల తాజా ఫామ్‌ ప్రకారం కోహ్లి సేన కంగారూలకు అందనంత ఎత్తులో ఉంది. సొంతగడ్డ అనుకూలత తప్ప ఆరోన్‌ ఫించ్‌ బృందం ఏ అంశంలోనూ మెరుగ్గా కనిపించడం లేదు. అయితే, పరిస్థితులు ఎలా ఉన్నా పోరాట పటిమ చూపే ఆస్ట్రేలియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.  

వారికి తోడుగా వీరు చెలరేగితే...  
కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో జట్టు బ్యాటింగ్‌ భారం మొత్తాన్ని ధావన్, రోహిత్, కోహ్లినే మోస్తున్నారు. అంబటి తిరుపతి రాయుడు కుదురుకోవడంతో నాలుగో నంబర్‌పైనా బెంగ తీరింది. మిగిలిందిక 5, 6 స్థానాల్లో వచ్చే ధోని, కేదార్‌ జాదవ్‌. గత 14 ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకం చేయలేకపోయిన ధోని... ఈ సిరీస్‌ ద్వారా ఫామ్‌లోకి రావాలని జట్టు ఆశిస్తోంది. గాయాల బెడద లేకుంటే జాదవ్‌ మంచి ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్నవాడు. నిరవధిక బహిష్కరణ ఎదుర్కొంటున్న హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండర్‌ బెర్త్‌ రవీంద్ర జడేజాకు దక్కనుంది. యజువేంద్ర చహల్‌ను కాదని కుల్దీప్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. బుమ్రాకు విశ్రాంతి నేపథ్యంలో... టెస్టు సిరీస్‌ ఆసాంతం బెంచ్‌కే పరిమితమైన భువనేశ్వర్‌ వన్డే సిరీస్‌లో కీలకం కానున్నాడు. అతడితో కలిసి షమీ కొత్త బంతిని పంచుకుంటాడు. పరుగులు ఇచ్చే బలహీనతను షమీ అధిగమించాలి. సొంతగడ్డపై రాణించిన ఎడంచేతి వాటం యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఆసీస్‌ పిచ్‌లపై ఎలా బౌలింగ్‌ చేస్తాడో చూడాలి. భువనేశ్వర్, షమీ ఉన్నందుకు హైదరాబాద్‌ యువ పేసర్‌ సిరాజ్‌కు అరంగేట్రం చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.  

ఆసీస్‌ కొత్తకొత్తగా... 
ప్రధాన పేసర్లు ముగ్గురికీ విశ్రాంతినిచ్చిన ఆతిథ్య జట్టుకు భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడం సవాలే. పీటర్‌ సిడిల్‌ ఎనిమిదేళ్ల తర్వాత వన్డే ఆడుతున్నాడు. టీమిండియా టాప్‌ఆర్డర్‌ నుంచి ఆసీస్‌ బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. షాన్‌ మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్‌ వంటి వారున్నా బ్యాటింగ్‌లో కెప్టెన్‌ ఫించ్‌పైనే ఆశలన్నీ. కీపర్‌ అలెక్స్‌ క్యారీతో కలిసి ఫించ్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. జట్టు పరిస్థితులరీత్యా టెస్టు స్పెషలిస్ట్‌ ఉస్మాన్‌ ఖాజాను వన్డేలకూ తీసుకున్నారు. అయితే, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌లాంటి విధ్వంసక ఆటగాళ్లతో బ్యాటింగ్‌ లైనప్‌ భారీగా ఉంది. టెస్టుల్లో స్పిన్నర్‌ లయన్‌ను దెబ్బతీసిన కోహ్లి సేన వన్డేల్లో అతడిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.  

పిచ్, వాతావరణం 
కొద్దిగా పచ్చికతో ఉన్నా ఫ్లాట్‌ పిచ్‌. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. చివరి టెస్టు సందర్భంగా సిడ్నీలో వర్షం కురిసింది. అయితే వన్డే మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.

►48 ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో భారత్‌ ఇప్పటివరకు 48 వన్డేలు ఆడింది. 11 మ్యాచ్‌ల్లో గెలిచి, 35 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. 

►16 సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 16 మ్యాచ్‌లు జరిగాయి. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్‌... 13 మ్యాచ్‌ల్లో పరాజయం చవి
చూసింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 

►2 ఆస్ట్రేలియా గడ్డపై ఆతిథ్య జట్టుతో భారత్‌ ఆడుతున్న రెండో ద్వైపాక్షిక సిరీస్‌ ఇది. 2015–16లో ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ జరుగగా... 
ఆసీస్‌ 4–1తో గెలిచింది. అంతకుముందు ఇక్కడ భారత్‌ మూడు లేదా నాలుగు దేశాలు పాల్గొన్న వన్డే  టోర్నీలు ఆడింది. 

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాయుడు, ధోని, జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్‌ అహ్మద్, షమీ.
ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్‌ (కెప్టెన్‌), ఖాజా, మార్‌‡్ష, హ్యాండ్స్‌కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, సిడిల్, రిచర్డ్‌సన్, లయన్, బెహ్రెన్‌డార్ఫ్‌. 

► ఉదయం గం.7.50 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లలో ప్రత్యక్ష ప్రసారం   

మరిన్ని వార్తలు