కాస్త జలుబు చేసిందంతే 

16 Mar, 2020 02:30 IST|Sakshi

కివీస్‌ పేసర్‌ ఫెర్గూసన్‌ వివరణ

ఆక్లాండ్‌: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త జలుబు చేసినా సరే నానా హైరానా పడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి న్యూజిలాండ్‌ పేస్‌ బౌలర్‌ లోకీ ఫెర్గూసన్‌కు కూడా ఎదురైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో తొలి వన్డే ఆడిన తర్వాత అతనికి కొంత అనారోగ్యంగా కనిపించడంతో కివీస్‌ బోర్డు వెంటనే స్పందించింది. కరోనా వైరస్‌కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్‌ రూమ్‌లోనే ఉండాలని నిర్బంధించింది. శనివారం అతని రిపోర్ట్‌లు నెగెటివ్‌గా రావడంతో ఊపిరి పీల్చుకొని ఫెర్గూసన్‌ ఆక్లాండ్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. దీనిపై అతను స్పందిస్తూ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు. కరోనా విషయంలో అతి చేసినట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు. ‘నా ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందారు. నేను బాగానే ఉన్నానని వారందరికీ సమాధానమిచ్చా. నాకు కాస్త జలుబు చేసిందంతే. అంతకుమించి ఏమీ కాలేదు. టీమ్‌ వైద్యులు నిబంధనలు అమలు చేశారు కాబట్టి అర్థం చేసుకోగలను. కానీ మొత్తంగా చూస్తే అంతా అతి చేసినట్లు అనిపిస్తోంది.’ అని ఫెర్గూసన్‌ అన్నాడు.  మరోవైపు కరోనా కారణంగా మరో రెండు క్రికెట్‌ ఈవెంట్లు రద్దయ్యాయి. జింబాబ్వేలో పర్యటిస్తోన్న ఇంగ్లండ్‌ కౌంటీ జట్టు డెర్బీషైర్‌ టూర్‌ను రద్దు చేసుకొని ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి టోర్నీ షెఫీల్డ్‌ షీల్డ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి.

>
మరిన్ని వార్తలు