ఫిక్సింగ్ కేసులో సొట్‌సోబ్

26 Feb, 2016 08:38 IST|Sakshi
ఫిక్సింగ్ కేసులో సొట్‌సోబ్

విచారణ జరుపుతున్న సీఎస్‌ఏ

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పేసర్ లొన్వాబ్ సొట్‌సోబ్... మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్నాడు. మాజీ సహచరుడు గులాం బోడితో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అతనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) విచారణ జరుపుతోంది. ఈ మేరకు సొట్‌సోబ్‌కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను, సెల్‌ఫోన్ రికార్డులను బోర్డు స్వాధీనం చేసుకుంది.

గతేడాది సఫారీ దేశవాళీ టి20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు కొంత మంది ఆటగాళ్లను సంప్రదించినట్లు తేలడంతో గులాం బోడిపై 20 ఏళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే బోడి సంప్రదించిన 8 మందిలో సొట్‌సోబ్, మాజీ వికెట్ కీపర్ తామి సోలెకెలి కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరు దేశవాళీ క్రికెట్‌లో బోడితో కలిసి ఆడారు.

‘మా బోర్డు అడిగిన అన్ని డాక్యుమెంట్లను అందజేశా. నా మెసేజ్‌లు, బ్యాంక్ అకౌంట్లు, ఇతరత్రా అన్ని విషయాలను వాళ్లకు తెలియజేశా. అయితే బోడి నుంచి నేను ఎలాంటి డబ్బును తీసుకోలేదు’ అని సొట్‌సోబ్ పేర్కొన్నాడు. మరోవైపు విచారణ అంశంపై మాట్లాడేందుకు దక్షిణాఫ్రికా బోర్డు నిరాకరించింది.

మరిన్ని వార్తలు