‘నంబర్‌వన్‌ బిచ్చగాడిని’ అయ్యేవాడిని!

18 Feb, 2017 00:05 IST|Sakshi
‘నంబర్‌వన్‌ బిచ్చగాడిని’ అయ్యేవాడిని!

అత్యుత్తమ ప్రదర్శనపై అశ్విన్‌ సరదా వ్యాఖ్య
కుంబ్లే రికార్డును చేరుకుంటే చాలన్న స్పిన్నర్‌


చెన్నై: రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటే పరిపూర్ణతకు పక్కా చిరునామా. తన బౌలింగ్‌కు ఇంజినీరింగ్‌ మేధస్సును జోడించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూలుస్తున్న అశ్విన్‌ ఇప్పుడు కెరీర్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పట్టుదల, పోరాటతత్వం ఉన్న ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ అగ్ర స్థానానికి చేరినా ఇంకా నేర్చుకునేందుకు, కష్టపడేందుకు సిద్ధమని చెబుతాడు. ఎంచుకున్న రంగంలో ఎప్పుడైనా తానే నంబర్‌వన్‌గా ఉండాలనేది తన లక్ష్యమంటూ అతను ఒక సరదా వ్యాఖ్య చేశాడు. ‘నేను జట్టులోకి వచ్చిన దగ్గరి నుంచి భారత్‌ ప్రతీ విజయాల్లో ఎంతో కొంత పాత్ర పోషించాను. ఇది పొగరుతో చెప్పడం లేదు. దానిని సాధించేందుకు నేను ఎంతో కష్ట పడ్డాను. నేను ఎక్కడికి వెళ్లినా నాదైన ముద్ర ఉండాలని తపించే వ్యక్తిని. ఒకవేళ నేను బిచ్చగాడిగా పుట్టి ఉన్నట్లయితే అప్పుడు కూడా చెన్నై నగరంలో నేనే నంబర్‌వన్‌ బిచ్చగాడిని అయ్యేవాడినేమో. అక్కడ అగ్రస్థానానికి చేరాక దేశంలోనే నంబర్‌వన్‌ బిచ్చగాడినయ్యేందుకు కృషి చేసేవాడిని’ అంటూ చెప్పుకున్నాడు. మురళీధరన్‌ 800 వికెట్ల మైలురాయిని అందుకోవడం తనలాంటి మానవమాత్రులకు సాధ్యం కాదని, అయితే కుంబ్లే వికెట్ల రికార్డు (619)ను చేరుకుంటే చాలని అశ్విన్‌ అన్నాడు.

‘మురళీ సాధించిన ఘనత చాలా పెద్దది. నేను ఆలస్యంగా టెస్టులు ఆడటం ప్రారంభించాను. మధ్యలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో కుంబ్లే రికార్డును చేరుకోవడమే గౌరవంగా భావిస్తున్నా. అంతకంటే ఒక్క వికెట్‌ కూడా ఎక్కువ ఆశించడం లేదు’ అని అతను చెప్పాడు. మరోవైపు భారత జట్టులో ప్రధాన సభ్యుడిగా ఎదిగినా అశ్విన్‌కు వైస్‌ కెప్టెన్సీ అవకాశం రాలేదు. దీనిపై వ్యాఖ్యానిస్తూ ‘నేను అలాంటివాటి గురించి ఆలోచించే దశను దాటిపోయానని భావిస్తున్నా. వైస్‌ కెప్టెన్‌ కావడం అనేది నా చేతుల్లో లేదు. క్రికెట్‌లో ప్రతీదానికి కొన్ని లెక్కలు ఉంటాయి. అలాంటివాటిని నేను మార్చలేనని అర్థమైంది. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోదల్చుకోలేదు. అయినా అలాంటి పేరు, హోదా ఏమీ లేకుండా కూడా విజయాల్లో కీలక పాత్ర పోషించి నేను జట్టును నడిపించాననే నమ్ముతున్నా’ అని అశ్విన్‌ తన మనసులో మాట వెల్లడించాడు.  

మరిన్ని వార్తలు