అదే మా కొంపముంచింది: బంగ్లా కెప్టెన్‌

11 Nov, 2019 11:55 IST|Sakshi

నాగ్‌పూర్‌: భారత్‌తో జరిగిన చివరి టీ20లో తమకు గెలిచే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్మదుల్లా స్పష్టం చేశాడు. ఓ దశలో మ్యాచ్‌ తమ చేతుల్లోనే ఉందని, కాకపోతే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇక తేరుకోలేక పోయామన్నాడు. తాము సిరీస్‌ను గెలిచే అవకాశాన్ని కోల్పోవడానికి భారత బౌలర్లే కారణమన్నాడు. మహ్మదుల్లా నయీమ్‌, మహ్మద్‌ మిథున్‌లు ఇన్నింగ్స్‌ను నిర్మించడంతో గెలుపుపై ఆశలు ఏర్పడ్డాయని, అయితే వీరిద్దరూ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ కోల్పోయమన్నాడు. వీరిద్దరూ ఔట్‌ కావడంతో పాటు స్వల్ప విరామాల్లో వికెట్లను చేజార్చుకోవడంతో అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నామన్నాడు.(ఇక్కడ చదవండి: చహర్‌ సిక్సర్‌... భారత్‌ విన్నర్‌)

భారత బౌలర్ల విజృంభణే తమ కొంపముంచిందన్నాడు. ఈ క్రమంలోనే నయీయ్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు మహ్మదుల్లా. నయీయ్‌ ఒక టాలెంటెడ్‌ బ్యాట్స్‌మన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అతను తన పనిని కూల్‌గా నిర్వహిస్తాడనే విషయం తాజా మ్యాచ్‌లో నిరూపితమైందన్నాడు. ప్రధానంగా భారత సీమర్లు తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేసి సక్సెస్‌ అయ్యారన్నాడు.  మూడో టీ20లో భారత​ 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.కేఎల్‌ రాహుల్‌(52), శ్రేయస్‌ అయ్యర్‌(62)లు హాఫ్‌ సెంచరీలు సాధించి గౌరవప్రదమైన స్కోరు సాధించారు.

ఆపై 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 144 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. నయీయ్‌(81: 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. మిథున్‌(27)తో కలిసి 98 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. కాగా, 110 పరుగుల వద్ద మిథున్‌ మూడో వికెట్‌గా ఔటైన తర్వాత బంగ్లాదేశ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. 34 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్‌ పరాజయం చవిచూసింది. భారత బౌలర్లు బంగ్లాను ఆలౌట్‌ చేసి విజయంలో కీలక పాత్ర  పోషించారు.

మరిన్ని వార్తలు