లయోలా డబుల్ ధమాకా

24 Feb, 2014 00:21 IST|Sakshi

 జింఖానా, న్యూస్‌లైన్: బీఎఫ్‌ఐ-ఐఎంజీ రిలయన్స్ ఇంటర్ కాలేజి బాస్కెట్‌బాల్ లీగ్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో లయోలా జట్లు విజేతగా నిలిచాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగం ఫైనల్లో లయోలా అకాడమీ 47-21తో భవాన్స్ డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. ఆట ప్రారంభం నుంచి లయోలా అకాడమీ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. ఒక దశలో లయోలా 23-6తో ముందంజలో ఉంది. అయితే భవాన్స్ ఆటగాళ్లు ప్రత్యర్థిని ఎదుర్కునేందుకు ఎంతగానో ప్రయత్నించారు.
 
 అయినప్పటికీ మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి లయోలా 37-10తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో భవాన్స్ ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ  చివరకు అది విఫలమైంది. లయోలా క్రీడాకారులు గణేశ్ (19), ఉదయ్ (11), జోస్ (11) చక్కని ఆట తీరును ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించారు. భవాన్స్ జట్టులో హేమంత్ (7), రోహ న్ (5), అనిల్ (4) రాణించారు. మహిళల విభాగం ఫైనల్లో లయోలా అకాడమీ 46-37తో ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల (జీసీపీఈ)పై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి.
 
  మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 24-21తో లయోలా ముందంజలో ఉంది. రెండో అర్ధ భాగంలో లయోలా క్రీడాకారిణులు అలవోకగా దూసుకె ళ్లారు. అనంతరం తేరుకున్న జీసీపీఈ క్రీడాకారిణిలు చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. లయోలా క్రీడాకారిణులు అక్షిత (15), మౌనిక (10), స్నేహ (7), రమా (8) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో మహిళల విభాగంలో సెయింట్ మార్టిన్స్ 39-34తో సీవీఎస్‌ఆర్ జట్టుపై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఏవీ కాలేజి 59-40తో సెయింట్ మార్టిన్స్‌పై నెగ్గింది.
 
  టోర్నీలో బెస్ట్ మెన్ ప్లేయర్ అవార్డును భవాన్స్ ఆటగాడు రోహన్ సొంతం చేసుకోగా... బెస్ట్ ఉమెన్ ప్లేయర్ అవార్డును లయోలా క్రీడాకారిణి రమా మిశ్రా దక్కించుకుంది. బెస్ట్ ప్రామిసింగ్ ప్లేయర్ టైటిల్‌ను భవ్య (జీసీపీఈ) గెలుచుకుంది. లయోలా అకాడమీ ప్రిన్సిపాల్ ఫాదర్ కాసిమిర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ బాస్కెట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
 

మరిన్ని వార్తలు