తండ్రి మరణంతో ఐపీఎల్‌కు దూరం!

14 Apr, 2018 18:31 IST|Sakshi
లుంగి ఎంగిడి (ఫైల్‌ ఫొటో)

చెన్నై : ‘మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లుంది’  ఈ సీజన్‌ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరిస్థితి. రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేసిన చెన్నైకి అన్నీ ఎదురుదెబ్బలే. ఇప్పటికే గాయాలతో స్టార్‌ ఆలౌరౌండర్‌ కేదార్‌ జాదవ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సురేశ్‌ రైనా రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. మరో వైపు కావేరి ఆందోళనలతో హోం మ్యాచ్‌లన్నీ పుణెకు తరలించబడ్డాయి. అయితే ఇప్పుడు ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి టోర్నీ నుంచి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం లుంగీ తండ్రి జీరోమ్‌ ఎంగిడి మరణించారు. తండ్రి మరణంతో స్వదేశానికి తిరుగుపయనమైన సఫారీ బౌలర్‌ మళ్లీ టోర్నీలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో భారత్‌.. దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో ఎంగిడి తెరపైకి వచ్చాడు. ప్రొటీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలనుకున్న భారత్ ఆశలపై ఎంగిడి నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేసిన సెంచూరియన్‌ టెస్టులో (6/39)తో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో ఈ సఫారీ ఆటగాడిని వేలంలో చెన్నై పోటీ పడి దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఎంగిడికి రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. విదేశీ ఆటగాళ్ల జాబితాలో మిచెల్‌ సాంట్నర్‌ దూరం కావడం, మార్క్‌వుడ్‌ అనుకున్న రీతిలో ప్రదర్శన చేయకపోవడంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఎంగిడికి అవకాశం ఇచ్చే యోచనలో చెన్నై ఉండగా అనూహ్యంగా ఎంగిడి దూరమయ్యాడు.

ఈ స్టార్‌ ఆటగాడి తండ్రి మరణంపై దక్షిణాఫ్రికా కెప్టెన్‌, చెన్నై సహచర ఆటగాడు డుప్లెసిస్‌ సంతాపం వ్యక్తం చేశాడు. ‘లుంగి ఎంగిడి తండ్రి జీరోమ్‌ మరణవార్త జట్టు సభ్యులందరినీ కలచివేసింది. అతనికి, అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. లుంగి ఎంగిడీకి ఇది ఎంతో కఠినమైన సమయం’ అని తెలిపాడు. క్రికెట్‌ సౌతాఫ్రికా అధ్యక్షుడు క్రిస్‌ నెన్‌ జానీ సైతం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ తర్వాతి మ్యాచ్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆడనుంది.

తల్లిదండ్రులతో లుంగిఎంగిడి

మరిన్ని వార్తలు