‘ప్రతీ సిక్స్‌ను డొనేట్‌ చేస్తా’

3 Jan, 2020 12:30 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పించ్‌ హిట్టర్లలో క్రిస్‌ లిన్‌ ఒకడు. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు ఈ హార్డ్‌ హిట్టర్‌. గతేడాది డిసెంబర్‌ నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై దక్కించుకుంది. క్రిస్‌ లిన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వదిలేసుకోవడంతో ఈసారి వేలంలోకి వచ్చాడు లిన్‌. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లిన్‌.. ఈ లీగ్‌లో కొట్టే ప్రతీ సిక్స్‌ను ఆస్ట్రేలియాలో అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ బాధితులకు డొనేట్‌ చేస్తానంటున్నాడు. ‘  హే గయ్స్‌.. ఈ ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో నేను కొట్టే ప్రతీ సిక్స్‌కు 250 డాలర్లను వారికి సాయంగా అందిస్తా. ఒక్కో సిక్స్‌కు 250 డాలర్లను ఇవ్వాలనుకుంటున్నా’ అని లిన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక ఆస్ట్రేలియాకు చెందిన వివాదాస్పద టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌ కూడా తన వంతు సాయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఏటీపీ కప్‌లో తాను కొట్టే ప్రతీ ఏస్‌కు 200 డాలర్లను ఇస్తానని తెలిపాడు. మరొక ఆసీస్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అలెక్స్‌ డి మినార్‌ కూడా ప్రతీ ఏస్‌కు 250 డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. కాకపోతే తాను ఎక్కువ ఏస్‌లు కొట్టలేనేమోననే అనుమానం వ్యక్తం చేశాడు. ఇలా క్రికెట్‌ స్టార్లు, టెన్నిస్‌ స్టార్లు కలిసి తమ దేశంలోని అడవులు అంటుకుని వాటి బారిన పడ్డ వారికి సాయం చేయడానికి నడుం బిగించారు. గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అడవులను అంటుకున్న మంటలు క్రమంగా న్యూసౌత్ వేల్స్ , విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్లాండ్ తదితర ప్రాంతాలకు వ్యాపించడంతో 17 మంది మ్యత్యువాడ పడగా వందల సంఖ్యలో గాయపడ్డారు.(ఇక్కడ చదవండి: క్రిస్‌ లిన్‌కు జాక్‌పాట్‌ లేదు..!)

>
మరిన్ని వార్తలు