-

అశ్విన్‌ నుంచి లాగేసుకున్నాడు..!

11 Apr, 2020 13:22 IST|Sakshi

మెల్‌బోర్న్‌:  భారత క్రికెట్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌గా తన మార్కును చూపెట్టిన రవిచంద్రన్‌ అశ్విన్‌ గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఒకవైపు జట్టులో చోటు సంపాదించడమే కష్టంగా మారిన తరుణంలో ఆడపా దడపా వచ్చిన అవకాశాల్ని కూడా అశ్విన్‌ పెద్దగా వినియోగించుకోలేకపోతున్నాడు. 71 టెస్టుల్లో 365 టెస్టు వికెట్లు సాధించిన అశ్విన్‌ పూర్వ వైభవం తగ్గిందనే చెప్పాలి.  ఇది విషయాన్ని ఆసీస్‌ మాజీ చైనామన్‌ బౌలర్‌ బ్రాడ్‌ హాగ్‌ తాజాగా స్పష్టం చేశాడు. తన ప్రకారం చూస్తే గతేడాది వరకూ వరల్డ్‌ బెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా ఉన్న అశ్విన్‌ను ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ అధిగమించాడన్నాడు. ట్వీటర్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌లో భాగంగా వరల్డ్‌ అత్యుత్తమ ఆఫ్‌ స్పిన్నర్‌ ఎవరని అడిగిన ప్రశ్నకు హాగ్‌ సమాధానమిచ్చాడు. ప్రధానంగా లయాన్‌-అశ్విన్‌లో ఎవరు ఉత్తమ అని ప్రశ్నకు తనదైన శైలిలో​  జవాబిచ్చాడు హాగ్‌. (నవ్వులు పూయిస్తున్న అశ్విన్‌ ‘కోచింగ్‌ అలెర్ట్‌’ వీడియో)

‘ ప్రస్తుతం వరల్డ్‌ బెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ లయాన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గడిచిన ఏడాది వరకూ బెస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రేసులో అశ్విన్‌ ముందు వరుసలో ఉండేవాడు.ఆ ప్లేస్‌ను అశ్విన్‌ నుంచి లయాన్‌ లాగేసుకున్నాడు. ఇద్దరు తమ తమ గేమ్‌లను మెరుగుపరుచుకుంటూ ముందుకుసాగుతున్నారు’ అని హాగ్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ 96 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లయాన్‌ 390 వికెట్లు సాధించాడు. 

మరిన్ని వార్తలు