‘అది గంగూలీకి గుర్తుందో లేదో’

19 Jun, 2020 12:07 IST|Sakshi

నా సలహాతోనే గంగూలీ ఓపెనర్‌గా వచ్చాడు

మాజీ కోచ్‌ మదనలాల్‌ వెల్లడి

కోల్‌కతా: భారత క్రికెట్‌ జట్టు అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్‌ గంగూలీ ఒకడు. అతని సారథ్యంలోని భారత జట్టు ‘దూకుడు’కు మారుపేరుగా నిలిచింది. ప్రధానంగా 2000 దశకంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లపై పై సాధించిన విజయాలే అందుకు ఉదాహరణ. ప్రత్యేకంగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టు విజయాలు, 2002లో నాట్‌వెస్ట్‌ ఫైనల్‌ విజయం, 2003 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు వరకూ చేరడం వంటివి గంగూలీ కెప్టెన్సీలో వచ్చినవే. అంతేకాకుండా వరల్డ్‌లో అత్యుత్తమ ఓపెనర్లలో గంగూలీ ఒకడిగా నిలవడం గురించే ప్రధానంగా చెప్పుకోవాలి. సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి అనేక ఓపెనింగ్‌ భాగస్వామ్యాలతో అరుదైన ఘనతలు సాధించిన గంగూలీ.. తన కెరీర్‌ తొలి నాళ్లలో ఐదో స్థానంలో వచ్చేవాడు. ఆ తర్వాత ఓపెనర్‌గా మారి సక్సెస్‌ అయ్యాడు గంగూలీ. అయితే గంగూలీ ఓపెనర్‌గా రావడం వెనుక తన సలహా ఉందంటున్నాడు మాజీ క్రికెటర్‌, మాజీ కోచ్‌ మదన్‌లాల్‌. (సచిన్‌ కెప్టెన్సీ వైఫల్యంపై మదన్‌లాల్‌ కామెంట్స్‌)

తన సలహాతోనే గంగూలీ ఓపెనర్‌గా మారి సక్సెస్‌ అయినట్లు వెల్లడించాడు.  ‘ మేము గంగూలీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనుకున్నాం. దాంతో అతన్ని ఓపెనర్‌గా చేయమని కోరా. ఆ విషయం దాదాకు గుర్తుందో లేదో తెలియదు. నేను గంగూలీని నేరుగా ఓపెనింగ్‌ దిగమని చెప్పా. ఐదో స్థానంతో ఉపయోగం లేదని వివరించా. దాంతో 1996లో దక్షిణాఫ్రికాతో జైపూర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో గంగూలీ తొలిసారి ఓపెనర్‌గా దిగాడు. సఫారీ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొంటూ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రతీ ప్లేయర్‌కి వారి సొంత శైలి అనేది ఉంటుంది. ప్రతీ బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లో సెటిల్‌ కావడానికి సమయం తీసుకుంటారు. ఇందులో కోహ్లి, రహానేలు కూడా మినహాయింపు కాదు.  గంగూలీకి మాత్రం అన్ని వైపులా షాట్లు ఆడే సామర్థ్యం ఉండేది.  దాంతోనే ఓపెనింగ్‌ సలహా ఇచ్చా.  దానికి ఓకే చెప్పిన గంగూలీ ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత సచిన్‌తో కలిసి ఎన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడో చూశాం.  ఆ ఇద్దరూ భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు’ అని మదన్‌లాల్‌ స్పోర్ట్స్‌కీడా ఫేస్‌బుక్‌ లైవ్‌ సెషన్‌లో  చెప్పుకొచ్చాడు. (రోహిత్‌ నా రోల్‌ మోడల్‌: పాక్‌ క్రికెటర్‌)

మరిన్ని వార్తలు