మలేసియా చేతిలో...

14 Feb, 2020 01:19 IST|Sakshi

భారత్‌కు తప్పని పరాజయం

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

మనీలా: ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. గ్రూప్‌ ‘బి’లో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 1–4తో మలేసియా చేతిలో పరాజయం చవిచూసింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ ఒక్కడే ఈ పోరులో గెలిచాడు. రెండు డబుల్స్‌ జోడీలు, ఇతర రెండు సింగిల్స్‌లోనూ భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. ఈ పరాజయంతో భారత్‌ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. కజకిస్తాన్‌తో గెలుపొందడంతో క్వార్టర్స్‌ చేరిన భారత్‌... శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌తో తలపడుతుంది.

తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రపంచ 11వ ర్యాంకర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ 18–21, 15–21తో లీ జి జియా చేతిలో కంగుతిన్నాడు. మొదటి డబుల్స్‌లో ఎం.ఆర్‌.అర్జున్‌–చిరాగ్‌ షెట్టి ద్వయం 18–21, 15–21తో అరొన్‌ చియా–సో వుయి ఇక్‌ జంట చేతిలో ఓడింది. దీంతో భారత్‌ 0–2తో ఓటమికి దగ్గరవగా... రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 14–21, 21–16, 21–19తో చిమ్‌ జున్‌ వీపై నెగ్గడంతో జట్టు ఆశలు నిలిచాయి. కానీ రెండో డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–లక్ష్యసేన్‌ జోడీ 14–21, 14–21తో ఒంగ్‌ యివ్‌ సిన్‌– తే ఈ యి జంట చేతిలో, ఆఖరి సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 10–21, 15–21తో లియాంగ్‌ జున్‌ హవ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

మరిన్ని వార్తలు